ఆస్తులు కాదు.. విలువలే అసలైన వారసత్వం.. పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి వివేక్

ఆస్తులు కాదు.. విలువలే అసలైన వారసత్వం..  పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి వివేక్
  • సమాజానికి ఆదర్శం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ: మండలి చైర్మన్ గుత్తా
  •  నాన్న స్ఫూర్తితోనే వ్యవసాయానికీ అవార్డు: పొన్నం
  •  ఉద్యమ పోరాట స్ఫూర్తి వారిది: మంత్రి వివేక్
  •  తండ్రి కష్టానికి పిల్లల విజయాలే నిదర్శనం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కోదండరెడ్డి, వెలిచాల కొండల్‌‌‌‌రావు, గొట్టె కనకవ్వకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డుల ప్రదానం


హైదరాబాద్, వెలుగు: మన తర్వాతి తరాలకు అందించాల్సింది ఆస్తులు కాదు.. విలువలు, మానవ సంబంధాలేనని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబ బంధాలు బలహీనపడుతున్న నేటి రోజుల్లో ప్రేమానురాగాలు, ఐక్యతతో కొనసాగుతున్న పొన్నం కుటుంబం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం - 2026’ ప్రదానోత్సవం జరిగింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను అందజేశారు. 

పురస్కార గ్రహీతలు వ్యవసాయ కమిషన్​ చైర్మన్ ఎం.కోదండరెడ్డి (వ్యవసాయ రంగం), వెలిచాల కొండల్​ రావు (సాహిత్య రంగం),  గొట్టె కనకవ్వ (జానపద కళాకారిణి)ను రూ. 50 వేల నగదు, మెమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ జీవనానికి, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభమని పేర్కొన్నారు. రైతు జీవితానికి గౌరవం తెచ్చిన వ్యక్తిగా పొన్నం సత్తయ్య నిలిచారన్నారు. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా నిలిచేవారని, నేడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతుండటంతో సమాజంలో ఒంటరితనం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

మాది రైతు కష్టం తెలిసిన కుటుంబం: మంత్రి పొన్నం

నాలుగేళ్లుగా విద్య, సామాజిక, కళా రంగాల్లోని ప్రముఖులను సత్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు.  గతేడాది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన సూచనతో ఐదో ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా చేర్చామని తెలిపారు. తమ తల్లిదండ్రులు చదువుకోకపోయినా తమకు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను నేర్పించారన్నారు.  రైతు కష్టం తెలిసిన కుటుంబం తమదని,  అందుకే రైతుల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న కోదండరెడ్డిని  వ్యవసాయ రంగ పురస్కారంతో గౌరవించుకున్నామని చెప్పారు. 

పొన్నం సత్తయ్య దార్శనికుడు: మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ చీఫ్ 

పొన్నం సత్తయ్య జీవితాంతం వ్యవసాయం చేస్తూనే, పిల్లలకు ఉన్నత విద్యను అందించిన దార్శనికుడని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ  మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కుమారులు అశోక్ గౌడ్ న్యాయవాదిగా, రవిచంద్ర జర్నలిజంలో, ప్రభాకర్ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం తండ్రికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.    1985 నుంచే తనకు పొన్నం ప్రభాకర్‌‌‌‌తో సాన్నిహిత్యం ఉందని, మట్టిలోని మాణిక్యాలైన గ్రామీణ కళాకారులను, జానపద ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పొన్నం కుటుంబం చూపిన ఐక్యత సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. వ్యక్తికి కష్టాల్లో కొండంత మానసిక బలాన్నిచ్చేది కుటుంబ వ్యవస్థేనని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి, విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం తరఫున ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. 

నేటి సమాజంలో హింస, అసహనం, కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయని, తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారం, మానవత్వమే పిల్లలకు అసలైన సంపద అని ప్రొఫెసర్​ హరగోపాల్ పేర్కొన్నారు. ఈ జీవన సాఫల్య పురస్కారం తన వ్యక్తిగతమైనది కాదని, తెలంగాణ రైతాంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని  పురస్కార గ్రహీత, వ్యవసాయ కమిషన్​ చైర్మన్​ ఎం. కోదండరెడ్డి పేర్కొన్నారు. పొన్నం సత్తయ్య మానవ విలువలు, మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు ప్రతీక అని సీనియర్ జర్నలిస్ట్ దిలీప్‌‌‌‌రెడ్డి అన్నారు. ప్రజల భాగస్వామ్యం, అభిప్రాయాలు, ఆలోచనలకు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యత ఉందని సాహిత్య పురస్కార గ్రహీత వెలిచాల కొండల్‌‌‌‌రావు అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యమ సమయంలో ఢిల్లీని కదిలించడంలో కీలక పాత్ర: మంత్రి వివేక్

తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ పీఠాన్ని కదిలించి పార్లమెంట్‌‌‌‌లో ‘జై తెలంగాణ’ నినాదాన్ని వినిపించిన ధైర్యశాలి పొన్నం ప్రభాకర్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. యూత్ కాంగ్రెస్ రోజుల నుంచే పోరాట స్ఫూర్తిని నింపుకున్న ఆయన.. ఉద్యమం ఎక్కడుంటే అక్కడ ముందు వరుసలో నిలిచారని గుర్తుచేసుకున్నారు. 2009లో ఎంపీగా పార్లమెంట్‌‌‌‌కు వెళ్లిన నాటి నుంచే పొన్నం ప్రభాకర్‌‌‌‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. సభలో ప్రభాకర్ వినిపించిన పోరాట గొంతుక ఉద్యమకారుల్లో ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపిందన్నారు. ఆ పోరాట పటిమ, ప్రజల పట్ల నిబద్ధత ఆయన తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ నేర్పిన జీవన విలువల నుంచే వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్నా.. పొన్నం ప్రభాకర్ తన మూలాలను, పాత మిత్రులను ఏనాడూ మరువలేదని కొనియాడారు. నేటి రోజుల్లో బంధాలు దూరమై కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్న తరుణంలో.. పొన్నం సత్తయ్య కుటుంబం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు గొప్ప ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సత్తయ్య ముగ్గురు కుమారులు అశోక్, రవిచంద్ర, ప్రభాకర్ ఇప్పటికీ ఎంతో ఐక్యంగా, ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటూ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.