- తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు మల్లు రవి, వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఏర్పడిన ఎల్‌పీజీ (వంట గ్యాస్) కొరతపై కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండైన ఎంపీలు పార్లమెంటు ‘మక ర ద్వారం’ వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 4 రోజుల క్రితం వరకు ‘‘గ్యాస్ కొరత లేదు”అని చెప్పి, ఇప్పుడు ‘‘కొరత ఉంది’’ అని ప్రభుత్వం మాట మార్చడాన్ని తప్పుబడుతూ ప్రధాని మోదీ కటౌట్లను ప్రదర్శించారు.
ఈ ఆందోళనలో ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘నామ్ నరేందర్ – కామ్ సరెండర్’’(పేరు నరేందర్, చేసే పని లొంగిపోవడం) అంటూ ప్రధానిని ఉద్దేశించి చేసిన నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే సామాన్యులపై గ్యాస్ భారం పడుతున్నదని, అంతర్జాతీయ పరిణామాలను సాకుగా చూపి ప్రజలను వంచిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీలు విమర్శించారు.
