ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు​ వేయించే ప్లాన్‌

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు​  వేయించే ప్లాన్‌
  • టీఆర్‌ఎస్‌పై సీఈవోకు బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. డబ్బులు,  మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నదని, అధికారులను మంత్రులు, ఎమ్మెల్సీలు బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారని మండిపడింది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ ప్రతినిధుల టీమ్​ హైదరాబాద్‌‌లో చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​(సీఈవో) శశాంక్​ గోయల్​ను కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ఓటర్లకు గూగుల్‌‌ పే, పేటీఎం ద్వారా ఓటుకు రూ. 10 వేల డబ్బులు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలకు సేవ చేసి ఎన్నడూ ఓట్లు అడగలేదని, ఎన్నికలప్పుడు మోసం చేసి గెలుస్తున్నారని వారు విమర్శించారు. పీవీ నరసింహారావుపై ఎన్నడూ లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్​ కావడంతో పీవీ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. 

కోట్లు ఖర్చు పెడుతున్న టీఆర్​ఎస్ - ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్  కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని హైదరాబాద్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ ఆరోపించారు. ఏడేళ్ల కింద ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రం చేశారని మండిపడ్డారు. ఈ ఏడేళ్లలో రూ.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఇందులో రెండున్నర లక్ష కోట్లు అప్పులు చేశారన్నారు. ఇన్ని నిధులు ఖర్చు చేసినా.. చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.  శుక్రవారం యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ (యూటీజే) నేతలు అమర్, సంపత్, అశోక్ రెడ్డి నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొని మాట్లాడారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులు మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అవుతాయన్నారు. వీటిని కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని, ప్రజా సమస్యలను మండలిలో ప్రస్తావిస్తానని చెప్పారు.