- భీకర దాడులు జరిపిన మహిళా సూసైడ్ బాంబర్లు
- 40 గంటల్లో 200 మందికిపైగా సోల్జర్లను చంపేసినట్లు వెల్లడి
- ఆపరేషన్ హెరోఫ్ పేరుతో పాక్ జవాన్ల స్థావరాలపై దాడులు
- ఇద్దరు మహిళా సూసైడ్ బాంబర్లు సహా 18 రెబెల్స్ కూడా మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పంజా విసిరింది. మూడు రోజులుగా సూసైడ్ దాడులు, బాంబు దాడులు చేస్తూ సైనికులపై విరుచుకుపడుతోంది. ఆపరేషన్ హెరోఫ్ పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో మహిళా సూసైడ్ బాంబర్లు పాల్గొన్నారని బీఎల్ఏ తెలిపింది. జనవరి 31 నుంచి 40 గంటల్లో తాము జరిపిన దాడులకు పాకిస్తాన్ ఆర్మీ, పోలీస్, ఫ్రాంటియర్ కోర్కు చెందిన 200 మందికి పైగా చనిపోయారని బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ చెప్పారు. క్వెట్టా, నోష్కీ, మస్తుంగ్, కలాట్, ఖారాన్, పంజ్‌గూర్, గ్వాదర్, పస్నీ, తుర్బత్, కేచ్, అవారన్ వంటి 12 నుంచి 14 జిల్లాల్లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ స్టేషన్లు, ఐఎస్ఏ హెడ్‌క్వార్టర్స్, ఎఫ్ సీ క్యాంప్‌లు, ప్రిజన్‌లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులపై ఒకేసారి సూసైడ్ బాంబులు, గన్ అటాక్స్, ఐఈడీ దాడులు జరిపామని వివరించారు. తమ దాడుల్లో 200 మందికి పైగా చనిపోగా.. మరో17 మంది ఆఫీసర్లను బందీలుగా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో తమ బీఎల్ఏ మజీద్ బ్రిగేడ్ (సూసైడ్ వింగ్)కు చెందిన 18 మంది కూడా చనిపోయారని అంగీకరించింది.
దాడుల్లో మహిళా ఫైటర్లు
బీఎల్ఏ మహిళా సూసైడ్ బాంబర్లు ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించారు. మజీద్ బ్రిగేడ్ కు చెందిన అసిఫా మెంగల్(24) నోష్కీలోని ఐఎస్ఏ హెడ్‌క్వార్టర్స్‌పై వెహికల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ తో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ దాడిలో అసిఫాతో పాటు చాలామంది ఆర్మీ సిబ్బంది చనిపోయినట్లు తెలిపింది. గ్వాదర్ ఫ్రంట్‌కు చెందిన మరో మహిళ హవా బలోచ్ (అలియాస్ ద్రోషుమ్) కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై దాడులు చేసింది. హవా తన మరణానికి 12 గంటల ముందు రికార్డ్ చేసిన ఓ వీడియోను బీఎల్ఏ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. పాక్ మంత్రి ఖవాజా అసిఫ్ ప్రకారం.. ఆర్మీపై జరిగిన రెండు దాడుల్లో మహిళలు పాల్గొన్నారని చెప్పారు.
177 మంది రెబల్స్నుచంపాం: పాక్ సర్కార్
బీఎల్ఏ దాడులపై బలూచిస్తాన్ సీఎం సర్పరాజ్ బుగ్టి స్పందించారు. బలోచ్ దాడుల్లో 17 మంది భద్రతా సిబ్బంది, 31 మంది సివిలియన్లు మరణించారని తెలిపారు. ప్రతిగా తమ సైన్యం జరిపిన ఆపరేషన్లలో రెండు రోజుల్లో 145 నుంచి177 మంది రెబల్స్ హతమయ్యారని చెప్పారు. శుక్రవారం 41 మంది రెబల్స్‌ను, శనివారం 92 మందిని చంపామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. గుర్తింపు కోసం ఇప్పటివరకు 167 మృతదేహాలను ఆసుపత్రులకు పంపామని ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ వెల్లడించారు. తమ ప్రతిదాడిలో మరణించినవారిలో ఎక్కువమంది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినవారని, వారికి ఇతర తిరుగుబాటు గ్రూపుల మద్దతు ఉందని చెప్పారు. వారిని ఎదుర్కొనేందుకు బలూచిస్తాన్ లోని పలు నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామన్నా రు. ఆత్మాహుతి దాడులతో పాటు రెబల్స్ ప్రావిన్స్‌లోని 12 వేర్వేరు పట్టణాలు, నగరాల్లోని భద్రతా, ప్రభుత్వ స్థావరాలపై దాడి చేసినట్లు రిండ్ అంగీకరించారు.
