హ్యామ్ రోడ్లకు రూ.9,161 కోట్ల హడ్కో రుణం.. రూ.19 వేల కోట్లతో నిర్మాణ పనులు

హ్యామ్ రోడ్లకు  రూ.9,161 కోట్ల హడ్కో రుణం.. రూ.19 వేల కోట్లతో నిర్మాణ పనులు
  • కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన40%  ఫండ్స్​కోసం సర్కారు లోన్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో నిర్మించనున్న రోడ్ల పనులకు హడ్కో నుంచి రూ.9,161 కోట్ల రుణం మంజూరైంది. ఆర్​అండ్​బీ, పంచాయతీ రాజ్​ శాఖ ఆధ్వర్యంలో రూ.19,300 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. అయితే, ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 40 శాతం ఫండ్స్​ కోసం సర్కారు లోన్​తీసుకున్నది. వార్షిక వడ్డీ రేటు 9.12 శాతం చొప్పున పదిహేడున్నర సంవత్సరాల్లో తిరిగి అప్పు చెల్లించే విధంగా తెలంగాణ రోడ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (టీజీ ఆర్డీసీ)కు హడ్కో ఈ రుణాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

మిగతా 60 శాతం నిధుల సమీకరణ బాధ్యత కాంట్రాక్టర్ల పైనే ఉంటుంది. పనులు పూర్తయ్యాక 15 ఏండ్లలో విడతలవారీగా ప్రభుత్వం బిల్లులు చెల్లించనుంది. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన హ్యామ్​ ప్రాజెక్ట్​లో భాగంగా ఆర్​అండ్​బీ శాఖ తరఫున రూ.13,006 కోట్లతో 441 రోడ్లను బాగుచేయడానికి 34 ప్యాకేజీల పనులు చేపడుతున్నారు. మొత్తం రెండు శాఖల తరఫున ఒకేసారి రూ.19,300 కోట్లతో పనులు చేపట్టడానికి సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుగా అడ్వాన్స్​మొబిలైజేషన్​కింద కాంట్రాక్ట్​సంస్థలకు 10 శాతం చొప్పున రూ.1,930 కోట్లను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. పనులు పూర్తిచేసే రెండున్నరేండ్లలో మిగతా 30 శాతం నిధులను ప్రభుత్వం చెల్లించాలి.  

ఇక పనులు వేగవంతం చేస్తాం..

హడ్కో నుంచి రూ.9,161 కోట్ల రుణం మంజూరు కావడంతో ఇక హ్యామ్​రోడ్ల పనులకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ఇప్పటికే ఆర్​అండ్​బీ శాఖ తరఫున కాంట్రాక్ట్​సంస్థలతో అగ్రిమెంట్లు కంప్లీట్ చేసేశాం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్యాకేజీల్లో పనులు మొదలుపెడతాం. - వెంకటేశ్వర్​ రావు, చీఫ్​ ఇంజినీర్, హ్యామ్​ రోడ్స్​ విభాగం, ఆర్​అండ్​బీ శాఖ