అక్టోబర్ 20న విజయదశమి పర్వదినం కావడంతో.. తెలంగాణలో దసరా సెలవులపై స్పష్టత వచ్చేసింది. అక్టోబర్ 10 (శని వారం) నుంచి 22 (గురు వారం) వరకు.. అంటే13 రోజులు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 23న మళ్లీ పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి. తెలంగాణలో అన్ని పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ దసరా.
ఈ పండగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతే ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం ముందుగానే సెలవు ప్రకటిస్తుంది. ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి.
ఇక.. హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెలకు వెళ్లే విద్యార్థుల విషయానికొస్తే.. సెలవుల్లో స్టూడెంట్లంతా సొంతూళ్లకు పయనమవుతారు. తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని సిటీ జీవనానికి తాత్కాలిక విరామం ప్రకటించి సొంతూళ్లకు వెళుతుంటారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి.
ముఖ్యంగా సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ,పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, బాన్సువాడ, ఆసిఫాబాద్, మెదక్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్కిక్కిరిసిపోయే దృశ్యాలు ప్రతీ సంవత్సరం కనిపిస్తుంటాయి. రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు అదనపు సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంటుంది.
