వీడియో: జుడో క్రీడాకారిణి చెంప వాయించిన కోచ్

వీడియో: జుడో క్రీడాకారిణి చెంప వాయించిన కోచ్
  • రెండు చేతులతో చొక్కా కాలర్ పట్టుకుని ఊపేసి చెంపపై కొట్టిన కోచ్
  • తనకు మామూలేనంటూ రింక్ లోకి వెళ్లిపోయిన జర్మనీ క్రీడాకారిణి మార్టినా ట్రజ్డోస్

టోక్యో: ఒలింపిక్స్ క్రీడా పోటీలకే కాదు...అనేక చిత్ర విచిత్రాలకు వేదికగా నిలుస్తోంది. మొన్నటికి మొన్న ఓ క్రీడాకారుడు అర్థనగ్నంగా.. ఒళ్లంతా ఆయిల్ పూసుకుని.. తమ అచారం ప్రకారం ప్రదర్శనగా వచ్చిన ఘటన హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మ్యాచ్ ఓడిపోయిన ఓ క్రీడాకారిణికి ఆమె కోచ్ లవ్ ప్రపోజ్ చేయగా.. దానికి ఆమె అంగీకరించిన ఘటన సైతం వైరల్ అయింది. ఇదే కోవలోనే జరిగిన విచిత్ర ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూడో ఈవెంట్ సందర్భంగా జరిగిన ఘటన తాలుకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
జర్మనీ జూడో క్రీడాకారిణి మార్టినా ట్రజ్డోస్ వడివడిగా పోటీలు జరిగే వేదిక వద్దకు వచ్చింది. ఆమె కోచ్ కూడా ఆమె వెనుకే అనుసరిస్తూ ఆమెకు సంబంధించిన బ్యాగ్ మోసుకుంటూ వచ్చాడు. ఈవెంట్ జరిగే వేదిక ముందు మెట్లు ఎక్కి బరిలోకి దిగేందుకు రెడీ అవుతుండగా..  మార్టినాను అనుసరిస్తూ వేదిక వద్దకు వచ్చిన కోచ్ తన చేతిలోని ఆమె బ్యాగును పడేసి..  ఒక్కసారిగా ఆమె కాలర్ వద్ద రెండు చేతులతో చొక్కా దుస్తులను పట్టుకుని గట్టిగా ఊపేశాడు. ఆపై ఆమె రెండు చెంపలను చెళ్లుమనిపించాడు. 32 ఏళ్ల ఆ జూడో క్రీడాకారిణి కోచ్ కొట్టిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అది తనకు సాధారణమైన విషయమే అన్నట్టుగా జూడో బరిలో దిగేందుకు వేదికపైకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోచ్ ఇలా కొట్టడం ఏం పద్ధతని విస్మయం.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. జర్మనీ జూడో క్రీడాకారిణి మార్టినా ట్రజ్డోస్ స్పందించి వివరణ ఇచ్చింది. ప్రతి పోరుకు ముందు ఇదొక సాధారణ చర్య అని, తాను మ్యాచ్ లో గెలిచేలా ఉత్తేజపరిచే చర్యలో భాగంగానే ఆవిధంగా చేస్తారని వెల్లడించింది.కోపంతో.. మనసులో పెట్టుకుని కొట్టాడనుకోవద్దని.. ఊహించని చర్య అయితే తాను షాక్ కు గురయ్యేదాన్ని కదా అని సరదాగా నవ్వేసింది.