బుల్లెట్ ట్రైన్ హబ్ గా హైదరాబాద్..3 గంటల్లోనే సిటీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లొచ్చు

బుల్లెట్ ట్రైన్ హబ్ గా హైదరాబాద్..3 గంటల్లోనే సిటీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లొచ్చు
  • 3 గంటల్లోనే సిటీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లొచ్చు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు కేటాయించినం
  • కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీతో పోల్చితే ఆరు రెట్లు ఎక్కువని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:  రాష్ట్రానికి కొత్తగా ప్రకటించిన మూడు హైస్పీడ్ ట్రైన్స్ తో హైదరాబాద్ త్వరలోనే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్ గా  మారబోతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. రవాణా సహా అనేక కీలక అంశాల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. హెల్త్ కేర్, ట్రాన్స్ పోర్ట్, ఎడ్యుకేషన్​కు ఊతం ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే, దక్షిణాది రాష్ట్రాలకు డైమండ్ ప్రాజెక్ట్​గా అభివర్ణించారు. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి.. అలైన్మెంట్స్ ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు. సోమవారం ఢిల్లీలోని రైల్వే భవన్​లో మీడియాతో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర బడ్జెట్​లో చేసిన కేటాయింపులను వివరించారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణె, హైదరాబాద్– బెంగళూరుకు మూడు కొత్త  హై స్పీడ్ ట్రైన్లు రానున్నాయని చెప్పారు. గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ.. ఈ ట్రైన్లు ఆయా ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగి ఉంటాయని తెలిపారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్), అలైన్ మెంట్స్ ఫైనలైజ్ కాగానే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

కేవలం 3 గంటల్లోనే ముంబై, చెన్నై, బెంగళూరు

ఈ బుల్లెట్ ట్రైన్స్ తో హైదరాబాద్ నుంచి కీలక మెట్రో పాలిటన్ సిటీలైన ముంబై, బెంగళూరు, చెన్నై, పుణేకు కేవలం 3 గంటల్లోపే చేరుకో వచ్చని రైల్వే మంత్రి తెలిపారు. అలాగే, హైదరాబాద్– పుణే కేవలం 1:55 గంటల్లో, పుణే–ముంబై 48 నిమిషాల్లో చేరుకోవచ్చని వివరించారు. అంటే హైదరాబాద్ – ముంబై కేవలం 2:30 గంటల్లో ఈ హై స్పీడ్ ట్రైన్స్ తో  రీచ్ కావొచ్చన్నారు. అలాగే, హైదరాబాద్ – చెన్నైకి 3 గంటల లోపు, హైదరాబాద్ – బెంగళూరు 2 గంటల్లో చేరుకోవచ్చిన వివరించారు. ఈ విధంగా మూడు ముఖ్యమైన మెట్రో పాలిటన్ సిటీల మధ్య గేమ్ చేంజర్ గా హైదరాబాద్ మారనుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి దశలో ముంబై–అహ్మదాబాద్ కు హై స్పీడ్ ట్రైన్ ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా టెక్నికల్, డిజైన్, ఎలక్ట్రికల్ టీం.. అన్ని అంశాలను పరిశీలించిందన్నారు. ఇది సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్ లో దేశంలోని ఏడు ముఖ్య నగరాలను కలిపేలా ఏడు బుల్లెట్ ట్రైన్లు తీసుకువచ్చిందన్నారు. ఇందులో నార్త్ కు రెండు, సౌత్ – వెస్ట్ రాష్ట్రాలకు మిగిలిన5 ట్రైన్లు ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా మరిన్ని హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లు తీసుకువస్తామన్నారు.  

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,454 కోట్లు

ఈసారి బడ్జెట్​లో తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5, 454 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. ఇది గత యూపీఏ–2 (2014) హయాంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన (రూ.886 కోట్లు) బడ్జెట్​తో పోల్చితే.. 6 రెట్లు ఎక్కువన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 47,984 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. అమృత్ స్కీం కింద రూ.2,015 కోట్లతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను  ఆధునీకరించినట్టు చెప్పారు. 5 వందే భారత్, 3 అమృత్ భారత్ ఎక్స్​ప్రెస్​లతో ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచి కనెక్టివిటీని మెరుగుపరిచినట్టు తెలిపారు. రాష్ట్రంలో 1,115 కి.మీ రైల్వే లైన్ 100 శాతం  ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినట్టు చెప్పారు. 499 అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మించినట్టు తెలిపారు. అలాగే, రైల్వే ప్రమాదాలను నివారించే దిశలో కవచ్​ను 627 చోట్ల మోహరించామని మంత్రి చెప్పారు.