ఎంజీఎంలో వెంటిలేటర్ పనిచేయక.. కరోనా పేషెంట్ మృతి

ఎంజీఎంలో వెంటిలేటర్ పనిచేయక.. కరోనా పేషెంట్ మృతి

 పవర్ కట్.. మొరాయించిన జనరేటర్
ముందే తెలిసినా ఏర్పాట్లు చేయని సిబ్బంది 
టెక్నికల్ ప్రాబ్లంతోనే మృతి: ఎంజీఎం సూపరింటెండెంట్  

వరంగల్​ సిటీ, ఆదిలాబాద్​ అర్బన్, వెలుగు: వరంగల్​ఎంజీఎం హాస్పిటల్​లో కరెంట్ పోవడం.. జనరేటర్, వెంటిలేటర్ పని చేయకపోవడంతో కరోనా పేషెంట్ ఊపిరాడక చనిపోయాడు. కమలాపురం మండలానికి చెందిన గాంధీ(25) అనే కరోనా పేషెంట్ ఎంజీఎం హాస్పిటల్ లోని కొవిడ్ వార్డులో వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పవర్ కట్ ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే చెప్పారు. అయినా ఎంజీఎం అధికారులు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయలేదు. దీంతో కరెంట్ పోయిన వెంటనే జనరేటర్ ఆన్ కాలేదు. కొవిడ్ వార్డులో గాంధీకి వెంటిలేటర్ మారుస్తుండగా అది పని చేయకపోవడంతో గాంధీ ఊపిరి ఆడక మృతిచెందాడు. ఎంజీఎంలో గాంధీ 25 రోజులుగా ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే గాంధీ చనిపోయాడని, అతని బంధువులు ఆరోపించారు. అయితే కొవిడ్ వార్డులో పేషెంట్ మృతికి చిన్న టెక్నికల్ ప్రాబ్లమే కారణమని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి చెప్పారు. కరెంట్ పోయిన తర్వాత జనరేటర్​ను ఆన్ చేస్తుండగా చిన్న సమస్య వచ్చిందని, వెంటిలేటర్​ను మార్చేలోపే పేషెంట్​మృతి చెందాడన్నారు. 

రిమ్స్ లో మంటలు.. ఉరికిన పేషెంట్లు 

ఆదిలాబాద్ ​రిమ్స్​హస్పిటల్ లో శనివారం మంటలు చెలరేగాయి. గ్రౌండ్​ఫ్లోర్​లోని ఎంఐసీయూలో ఏసీ స్టెబిలైజర్​లో షార్ట్​సర్క్యూట్ తో మంటలు వచ్చాయి. ఏసీ మెషీన్ల నుంచి  ఒక్కసారిగా మంటలు రావడంతో వార్డులో ట్రీట్​మెంట్​పొందుతున్న పేషెంట్లు, వారి బంధువులు భయంతో బయటకు ఉరికారు. హాస్పిటల్ స్టాఫ్​వెంటనే మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. అయితే హాస్పిటల్ నిర్వహణ సరిగ్గా లేనందుకే ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయంటూ పేషెంట్లు, వాళ్ల బంధువులు మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకుంటామని రిమ్స్ అధికారులు తెలిపారు.