70 ఏళ్లలో పూర్తికాని పనులు ఏడేళ్లలో చేశాం

70 ఏళ్లలో పూర్తికాని పనులు ఏడేళ్లలో చేశాం
  • పల్లె ప్రగతి గ్రామసభలో మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల: స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో ఎన్నడూ జరగని పనులు గత ఏడేళ్లలో పూర్తి చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నా కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రని ఎండల్లో కూడా తెలంగాణలో చెరువులన్నీ నీటితో నిండి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. గురువారం గంభీరావు పేట మండలం రాజుపేటలో పల్లెప్రగతి గ్రామ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జనాభా ఆధారంగా అన్ని గ్రామాలకు పల్లె ప్రగతి కింద క్రమం తప్పకుండా 338 కోట్ల నిధులు ఇస్తున్నామన్నారు. మంత్రుల జీతాలు ఆపైనా.. పల్లెలకు నిధులిస్తన్నామని వివరించారు. గంభీరావుపేట రాజుపేటలో  20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని, గతంలో సగం నిర్మించి ఆగిపోయిన యాదవ సంఘ భవనాన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత గొర్రెల కోసం డీడీలు చెల్లించన వారికి 3.60 లక్షల గొర్రెల యూనిట్లు త్వరలోనే ఇస్తామన్నారు. కరోనా వల్ల గొర్రెల పంపిణీ  కొద్దిగా ఆలశ్యమైందన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో పశువుల సంఖ్య రెట్టింపైందని కేంద్రమే చెబుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం, చెత్త తొలగించేందుకు ట్రాక్టర్, హరితహారం మొక్కలకు నీరు పోసేందుకు ట్యాంకర్ లాంటివి సమకూర్చాం., ఏనాడు నిండని అప్పర్ మానేరు నిండి ఈ  ప్రాంతం అంతా కళకళలాడుతోందన్నారు. గంభీరావుపేట మండల వాసులు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు మానేరుపై 10 కోట్లతో వంతెన నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.