V6 News

వింబుల్డన్ లో చరిత్ర సృష్టించిన జకోవిచ్

వింబుల్డన్ లో చరిత్ర సృష్టించిన జకోవిచ్
  • పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత నోవాక్ జకోవిచ్
  • అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో ఫెదరర్, నాదల్ సరసన నిలిచిన జకో
  • జకోవిచ్ కు ఇది 6వ వింబుల్డన్ టైటిల్

లండన్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను హాట్ ఫెవరేట్, సెర్బియా యోధుడు నోవాక్ జకోవిచ్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో బెరోటిన్ పై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. జకోవిచ్ కు ఇది 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన జకోవిచ్ కూడా చోటు దక్కించుకున్నాడు. 
మొదటి సెట్ కోల్పోయినా పట్టుదలతో పోరాడిన జకో
తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం బరిలోకి దిగిన బెరిటినీ తొలి సెట్ లో గెలిచినా ఆ తర్వాత నోవాక్ జకోవిచ్ ఎదురుదాడికి దిగడంతో వరుస సెట్లు ఓడిపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టైటిల్ ఫెవరేట్ గా బరిలోకి దిగిన సెర్బియా యోధుడు  నోవాక్ జకోవిచ్ తన ప్రత్యర్థి ఇటలీకి చెందిన మాటో బెరిటినితో హోరాహోరీగా తలపడ్డాడు. స్కోరు 6  - 7 తేడాతో తొలి సెట్ ను కోల్పోవడంతో ఒకింత నిరాశకు లోనైనట్లు కనిపించాడు. అయితే వెంటనే తేరుకుని రెండో సెట్ లో బెరిటినీని 6 - 4 తేడాతో ఓడించాడు. అదే ఊపును కొనసాగించి వరుసగా మిగిలిన రెండు సెట్లు 6 - 4, 6 - 3 తేడాతో ఓడించి ఘన విజయం సాధించాడు.