V6 News

ప్రారంభమైన కేదార్‌నాథ్ దర్శనాలు : భక్తులకు అలర్ట్.. మొబైల్స్, రీల్స్, డ్రోన్లకి నో ఎంట్రీ!

ప్రారంభమైన కేదార్‌నాథ్ దర్శనాలు : భక్తులకు అలర్ట్..  మొబైల్స్, రీల్స్,  డ్రోన్లకి నో ఎంట్రీ!

భారీ మంచు కురుస్తున్న, వేల మంది భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్  చేరుకోవడంతో, బుధవారం ఉదయం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత ఆలయం తెరుచుకోవడంతో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిజానికి ఏప్రిల్ 19నే (అక్షయ తృతీయ) చార్ ధామ్ యాత్ర మొదలైనప్పటికీ, ఈరోజు  నుంచి కేదార్‌నాథ్ దర్శనాలు ప్రారంభమయ్యాయి.

కేదార్‌నాథ్  కొత్త రూల్స్ ఇవే.. 
ఆలయ పవిత్రతను కాపాడటం కోసం అధికారులు ఈసారి చాలా కఠినమైన నియమాలు పెట్టారు. ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు వాడటం, ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధించారు.

అంతేకాకూండా  ఆలయం దగ్గర వీడియోలు తీయడం లేదా సోషల్ మీడియా రీల్స్ చేయడం కుదరదు. ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అలాగే అనుమతి లేకుండా డ్రోన్లను ఎగరవేయడం కూడా నిషేధం విధించారు. ఇప్పటికే నిబంధనలు పాటించని  రెండు డ్రోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే భక్తుల ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను  భద్రపరచడం కోసం ఆలయ యంత్రాంగం ప్రత్యేక మొబైల్  కౌంటర్లు, లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.

వాతావరణంపై హెచ్చరిక:
ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో విపరీతమైన చలి, మంచు ఉంది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీగా మంచు కురవడంతో దారి పొడవునా మంచు పేరుకుపోయింది.

దింతో యాత్రికులకు సూచనలు జారీ చేస్తూ  కేదార్‌నాథ్ ఆలయ సందర్శకులు తప్పనిసరిగా వారి వెంట మందపాటి ఉన్ని దుస్తులు (స్వేటర్స్ /జాకెట్స్ ) తెచ్చుకోవాలని  కోరారు. మంచును చూసి ఉత్సాహంతో ప్రమాదకరమైన చోట్లకు వెళ్లకూడదని... అధికారులు సూచించిన దారిలోనే ప్రయాణించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.