విదేశాల్లో తెలుగోళ్ళను తీసుకొచ్చేందుకు వందే భారత్‌‌ ఫ్లైట్లు చాలవు

విదేశాల్లో తెలుగోళ్ళను తీసుకొచ్చేందుకు వందే భారత్‌‌ ఫ్లైట్లు చాలవు

కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల విదేశాల్లో లక్షా తొంబై వేల మంది ఇండియన్లు చిక్కుకుపోయారు. వీళ్లలో 34% మంది స్టూడెంట్లు, 30% మంది వలస కార్మికులున్నారు. మిగతా వాళ్లు పర్యాటకులు, ట్రీట్‌‌మెంట్‌‌ కోసం వచ్చినవాళ్లు, వ్యాపారులు. వీళ్లలో చాలా మంది ఉద్యోగాలు పోయి, సరైన ట్రీట్‌‌మెంట్‌‌ అందక, కనీస వసతుల్లేక కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కజకిస్తాన్‌‌లో స్టూడెంట్లు, వేరే దేశాల్లో గర్భిణులది ఇలాంటి పరిస్థితే. కానీ వాళ్లను సొంత దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం వందేభారత్‌‌ మిషన్‌‌ను స్టార్ట్‌‌ చేసింది. మే 20 వరకు 34 దేశాల నుంచి 173 విమానాలు, 3 నౌకల ద్వారా ప్రవాస భారతీయులను సొంతూర్లకు చేర్చింది. మే 28 వరకు 45,216 మందిని తీసుకొచ్చింది. ఇందులో 8,069 మంది వలస కార్మికులు.. 7,656 మంది స్టూడెంట్లు.. 5,107 మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. 5 వేల మంది నేపాల్, బంగ్లాదేశ్ భూమార్గం ద్వారా వచ్చినట్టు సర్కారు చెప్పింది.

3 లక్షల మందికి పైగా వివరాలిచ్చారు

వివిధ దేశాల్లోని ఇండియన్‌‌ ఎంబసీల్లో 3,08,200 మంది వలస ప్రజలు వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే జూన్‌‌ 13లోగా 60 దేశాల నుంచి లక్ష మందిని తీసుకురావాలని విదేశాంగ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మే 7 నుండి మే 16 వరకు మొదటి ఫేజ్‌‌లో 12 దేశాల నుంచి 64 విమానాల ద్వారా 16,716 మందిని తెచ్చింది. మే 17 నుంచి మే 22 వరకు రెండో ఫేజ్‌‌ మొదలైంది. ఇది జూన్ 13 వరకు కొనసాగుతుంది. 60 దేశాల నుంచి 429 విమానాలు (311 అంతర్జాతీయ,118 ఫీడర్ విమానాలు) దేశంలో అడుగు పెట్టనున్నాయి. ఇరాన్, శ్రీలంక, మాల్దీవుల నుంచి 4 నౌకల ద్వారా ఇండియన్లను తీసుకొస్తారు. రిటర్న్ ఫ్లైట్ ఖాళీ కాబట్టి విమాన చార్జీలు రెట్టింపు వసూలు చేస్తున్నారు. మే 17 నుంచి జూన్ 4 వరకు 32 దేశాలకు 240 విమానాలు వేస్తున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి. ఎపుడు ఇంటికి చేరతామో తెలియక కొంత మంది తెలుగు వాళ్లు గుండె ఆగి చనిపోయారు.

కువైట్‌‌లో తెలుగు కార్మికులెక్కువ

కువైట్‌‌లో 1,68,000 మంది వివిధ దేశాల వాళ్లు ఇల్లీగల్‌‌గా ఉంటున్నారు. ఇందులో ఇండియన్లు 42 వేల మంది. విదేశీయుల్లో 25 వేల మంది క్షమాభిక్ష పథకం వాడుకోనున్నారు. వీళ్లలో 15 వేల మంది ఇండియన్లున్నారు. వీళ్లు ఇండియా రాబోతున్నారు. కువైట్ సర్కారు వీళ్లందరికీ సదుపాయాలు కల్పిస్తోంది. 6 వేల (7000 గల్ఫ్ న్యూస్ ) మంది సరైన షెల్టర్‌‌లో ఉన్నారు. మిగతా వాళ్లు బయట అవుట్ పాస్‌‌లు, పాస్‌‌పోర్టుల కోసం వేచి చూస్తున్నారు. ఆమ్నెస్టీలో స్వదేశానికి ఇండియన్లను తీసుకురావడం ఆలస్యమైంది. కువైట్‌‌లో తెలుగు కార్మికులు ఎక్కువ. వీళ్లలో ఆడ వాళ్లు, ముసలి వాళ్లు ఎక్కువ. వీళ్ల ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఆడవాళ్లు 52 రోజులుగా ఒకే రూమ్‌‌లో ఉంటున్నారు. ఫోన్ చేయడానికి డబ్బుల్లేక, తెలిసిన వాళ్లతో అత్యవసర విషయాలు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. కువైట్ నుంచి ఆమ్నెస్టీ ద్వారా 150 మంది విజయవాడకు, 234 మంది భోపాల్‌‌కు,  గత 4 రోజుల్లో 2 వేల మంది ఇండియా చేరుకున్నారు. జూన్ 4 రాత్రికల్లా 136 మంది కువైట్ ఆమ్నెస్టీ ద్వారా గౌహతి చేరుకుంటారు. ఇంకా చాలా దేశాలకు ఆమ్నెస్టీ వాళ్లు వెళ్లలేదు. కొన్ని దేశాల్లో సొంతూర్లకు చేరడానికి ఫ్రీ టికెట్‌‌తో పాటు చేతి ఖర్చుకు డబ్బులూ ఇచ్చారు.

వందేభారత్‌‌ ద్వారా తెలుగు రాష్ట్రాలకు వచ్చేది 7 .5 %

వందేభారత్‌‌ విమానాల్లో 49 దేశాల నుంచి 96,978 మందిని తరలిస్తారని ఎంఈఏ వెబ్‌‌సైట్‌‌లో లెక్క చూపించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 7,229 (7 .5 %) మంది రానున్నారు. ఇందులో తెలంగాణకు 5,486 మంది వస్తారు. కానీ కర్నాటక, ఆంధ్ర , మహారాష్ట్ర వాళ్లు దగ్గరి ఎయిర్‌‌పోర్టుగా హైదరాబాద్‌‌ను ఎంచుకుంటే తెలంగాణ వాళ్లకు అవకాశం తక్కువే. విడిగా ఆంధ్రప్రదేశ్‌‌కు 1,743 (విజయవాడ 600 , హైదరాబాద్ 300, తిరుపతి 150, విశాఖపట్నం 693) వస్తారు. ఢిల్లీకి 28,027 (29 %) మంది, కేరళకు 26,695(28 % ) మంది రానున్నారు. ఐతే నోర్కా (డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ నాన్‌‌ రెసిడెంట్‌‌ కేరళైట్స్‌‌ అఫైర్స్‌‌) ద్వారా రిజిస్టరైన వాళ్ల వివరాలను విదేశాంగ శాఖకు కేరళ సీఎం చెప్పారు. వాళ్లు వచ్చాక తీసుకునే జాగ్రత్తలను వివరించి,  విమానాలను వేయించుకోవడంలో సక్సెస్‌‌ అయ్యారు. మే 28న 9 విమానాల్లో 1,500 మందిని తీసుకొచ్చారు. చేతులు దులుపుకునే ఈ పరిస్థితిలో ఇలాంటి పని చేశారని కేరళ సీఎంను జనం పొగిడారు. వందే భారత్‌‌లో కేరళ, ఢిల్లీలకు ఎక్కువ విమానాలు నడిపారు. ప్రజా నిష్పత్తి ప్రకారం విమానాలను కేటాయించనందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు అసహనం ప్రదర్శిస్తున్నారు. వందేభారత్‌‌ ద్వారా మహారాష్ట్రకు 7,558 మంది, కర్నాటకకు 5,745, గుజరాత్‌‌కు 4,913, తమిళనాడుకు 3,363, రాజస్థాన్‌‌కు 2,675, పంజాబ్‌‌కు 2,580, యూపీకి 1,873, కాశ్మీర్‌‌కు 1,565, బెంగాల్‌‌కు 1,445, బీహార్‌‌కు 1,346, ఒడిశాకు 1,066, చండీగఢ్‌‌కు 449, అస్సాంకు 150, మధ్యప్రదేశ్‌‌కు 150, గోవాకు 149 మంది రానున్నారు.