చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో తమిళనాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ తరుణంలో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌తో టచ్‌లోకి వచ్చిన వార్తలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
పార్టీ ఎమ్మెల్యేలు విజయ్‌తో టచ్‌లోకి వెళ్లారని వార్తలు వెలువడగానే అన్నాడీఎంకే హైకమాండ్ అప్రమత్తమైంది. ఈ మేరకు పార్టీ చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి బుధవారం (మే 6) పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు అందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వమని ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలో హైకమాండ్ మాట లెక్క చేయకుండా 10 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇస్తామని సంప్రదింపులు జరపడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విజయ్‌తో టచ్‌లోకి వెళ్లిన ఆ 10 ఎమ్మెల్యేలు ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం ఆరా తీస్తోంది. ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో తమిళనాడులో జంపింగ్‌ల పర్వం మొదలు కాబోతుంది. విజయ్‌కు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో పాటు పదవులు దక్కించుకుని అధికారం చెలాయించొచ్చని డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో కొందరు భావిస్తున్నారు. మరీ జంపింగ్ రాయుళ్లను పార్టీలు ఏ మేరకు కట్టడి చేస్తాయో చూడాలీ.
