- నైతిక విలువలు పాటించకపోవడంతో తొలగించామన్న ఎయిర్ ఇండియా
ముంబై: ఎయిర్ ఇండియా గత మూడేళ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. వీరు నైతిక విలువలను పాటించలేదని కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. స్టాఫ్‌తో శుక్రవారం జరిగిన టౌన్ హాల్ మీటింగ్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఉద్యోగులకు ఇచ్చే 'లీజర్ ట్రావెల్' (ఈఎల్‌టీ) సౌకర్యాన్ని వందలాది మంది తప్పుగా వినియోగించినట్లు తేలింది. అలాగే, విమానం నుంచి వస్తువులను అక్రమంగా తరలించడం, ఛార్జీలు వసూలు చేయకుండా అదనపు లగేజీని అనుమతించడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగించాం”అని ఆయన అన్నారు.
ఎవరూ చూడకపోయినా సరైన పద్ధతిలో పని చేయాలని, క్రమశిక్షణ లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా గ్రూపు సుమారు రూ.22 వేల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఖర్చుల తగ్గింపు చర్యలపై దృష్టి పెట్టింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఈ ఏడాది మరింత గడ్డు పరిస్థితులు ఉండొచ్చని, వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేస్తున్నట్లు విల్సన్ తెలిపారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం 24 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు.
