- చెంచుల కోసం ఏర్పాటైన మన్ననూర్ విభాగంలో పోస్టులన్నీ ఖాళీ
- ఆఫీసులో అన్నింటికీ సీనియర్ అసిస్టెంటే దిక్కు
- 17 మంది పని చేయాల్సిన చోట ఒక్కరే
హైదరాబాద్, వెలుగు: నల్లమల అడవుల్లో చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మన్ననూర్ ఐటీడీఏలో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. 14 వేల పైచిలుకు చెంచుల సంక్షేమం చూడాల్సిన ఐటీడీఏలో 17 మంది పని చేయాల్సి ఉండగా, ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) సహా ఇతర పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐటీడీఏ ఏర్పాటైనప్పటి నుంచి గత ఐదేళ్లుగా కేవలం ఒకే ఒక్క సీనియర్ అసిస్టెంట్ తో ఆఫీసు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ గంగాధర కిశోర్ కుమార్ మన్ననూర్ ఐటీడీఏలో శాఖల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులు, ఎల్టీఆర్ కేసుల వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ వివరాలు వెలుగు చూశాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని గిరిజన గ్రామాలు, చెంచు పెంటలు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ కేంద్రంగా ఐటీడీఏ(ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్స్–చెంచు)ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి మహబూబ్ నగర్ జిల్లాలోని 20 గ్రామాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 88, నల్గొండ జిల్లాలోని 9, రంగారెడ్డి జిల్లాలోని 11, వికారాబాద్ జిల్లాలోని 22 గ్రామాలు వచ్చాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 189 చెంచు పెంటలు ఇందులో ఉన్నాయి. ఈ ఐటీడీఏను కేవలం చెంచుల అభివృద్ధి, సంక్షేమానికి పరిమితం చేసి ఎక్స్ అఫీషియో పీఓ పోస్టుతోపాటు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కేటాయించారు. శ్రీశైలం ఐటీడీఏ నుంచి ట్రాన్స్ఫర్పై వచ్చిన సీనియర్ అసిస్టెంట్ మహమ్మద్ జాఫర్ హుస్సేన్ ఒక్కరే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.
పెండింగ్లో పోడు పట్టాల అప్లికేషన్లు
2006లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2,630 కుటుంబాలకు 4,412 ఎకరాల భూమికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేశారు. ఆ తర్వాత 2008–09లో 291 మంది గిరిజనులు 864 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు హక్కు పత్రాలు జారీ చేయలేదు. మరో ఐదు వేల కుటుంబాలు పోడు భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి.
