‘జై శ్రీరాం’ అనలేదని.. బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

‘జై శ్రీరాం’ అనలేదని..  బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

కాన్పూర్: ‘జై శ్రీరాం’ అనలేదని 16 ఏళ్ల బాలుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బర్రా ప్రాంతంలో నివసించే మొహమ్మద్ తాజ్ అనే యువకుడు శుక్రవారం కిద్వాయ్ నగర్​లో నమాజ్ చేసి ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు బైకుల్లో వచ్చారు. తన ఇంటికి దగ్గర్లో ఉండగా అడ్డుకున్నారు. ‘‘తాజ్.. సంప్రదాయ టోపి పెట్టుకున్నందుకు వాళ్లు అభ్యంతరం చెప్పారు. తర్వాత జై శ్రీరాం అని నినాదాలు చేయమన్నారు. అందుకు అతడు నిరాకరించడంతో పిడిగుద్దులు గుప్పించారు” అని బర్రా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీశ్ కుమార్ సింగ్ చెప్పారు. ‘‘నా టోపీ తీసేశారు. ఆ ఏరియాలో టోపీ పెట్టుకోవడానికి అనుమతి లేదని చెప్పారు. కింద పడేసి కొట్టారు” అని తాజ్ చెప్పాడు. దెబ్బలకు తట్టుకోలేక తాజ్ అరవడంతో చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్లు అక్కడి వచ్చారు. దీంతో దుండగులు పారిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.