న్యాయం చేయాలని కోరుతున్న డీఎస్సీ అభ్యర్థులు

న్యాయం చేయాలని కోరుతున్న డీఎస్సీ అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు:ఉమ్మడి ఏపీలో1998లో డీఎస్సీ రాసిన అభ్యర్థులు ఉద్యోగం కోసం 24 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా, అవి అమలు కావడం లేదు. ఉమ్మడి ఏపీలో జరగని న్యాయం రాష్ట్ర ఏర్పాటు తర్వాతైనా జరుగుతుందని భావించిన అభ్యర్థులకు గత ఎనిమిదేండ్లలో నిరాశే మిగిలింది. కాగా, మూడ్రోజుల క్రితం 1998 డీఎస్సీ బ్యాచ్​అభ్యర్థులను టీచర్లు గా నియమించేందుకు ఏపీలోని జగన్​సర్కారు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణలోని1,100 మంది అభ్యర్థులు కూడా కేసీఆర్​సర్కారు నిర్ణయం కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. తమకూ న్యాయం చేయాలని కోరుతున్నారు. 

అధికారుల తప్పిదానికి అభ్యర్థులు బలి

ఉమ్మడి ఏపీలో1998లో టీచర్​ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించారు. పోస్టుల భర్తీకి ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌‌గా నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం 221 జీవో జారీ చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ పరిధిలో కూడా అభ్యర్థులు​లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌‌గా తగ్గిస్తూ ప్రభుత్వం మరో జీవో 618ని కొద్ది రోజులకే విడుదల చేసింది. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, రెండు కేటగిరీలకు చెందిన అభ్యర్థులను ఒకేసారి పిలవడంతో సమస్య తలెత్తింది. ఇలా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవడంలో అధికారుల తప్పిదాలు, కోర్టు కేసుల కారణంగా ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. ఏపీ అడ్మినిస్ట్రేటివ్​ట్రిబ్యునల్ వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత 2011లో హైకోర్టు కూడా ట్రిబ్యునల్​ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును కూడా అప్పటి ప్రభుత్వం అమలుచేయకపోవడంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించి, ఉద్యోగాలివ్వాలని ఆదేశించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోయాక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టేశాయి. బాధిత అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

మాకు న్యాయం చేయాలి.. 

మేం న్యాయ పోరాటంలో గెలిచినా.. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పులను అమలు చేయడం లేదు. మాలో చాలా మంది 50 ఏండ్లకు దగ్గర్లో, మరికొందరు రిటైర్మెంట్ కు చేరువలో ఉన్నారు. మాకు ఉద్యోగమివ్వాలని ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలుస్తూనే ఉన్నాం. సీఎం కేసీఆర్ కూడా మాకు న్యాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్​లాగే సీఎం కేసీఆర్​కూడా ఉద్యోగాలిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. 
- బలదేవ్​రెడ్డి, 1998 డీఎస్సీ సాధన సమితి