కీవ్: ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవులో ‘ఎంవీ ఏజీఎన్ రగ్నార్’ అనే వాణిజ్య నౌకపై శనివారం క్షిపణి దాడి జరగడంతో ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలోని సిబ్బందిలో నలుగురు భారతీయులు ఉండగా.. ఇద్దరిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడిందని కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ ఆదివారం వెల్లడించింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు తెలిపింది. ఈ దాడి చేసింది ఎవరు..? దాడికి గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పేర్కొంది. భారతీయ సిబ్బంది గుర్తింపు, వారి విధుల గురించి కూడా ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నట్టు తెలిపింది.
కాగా, 2022లో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచీ నల్ల సముద్రంలోని ఉక్రెయిన్ పోర్టులలోని నౌకలపై తరచూ క్షిపణి, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. నల్ల సముద్రంతోపాటు హార్మూజ్, ఇతర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడుల వల్ల గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉక్రెయిన్‌కు ప్రయాణించవద్దని భారత్ తన పౌరులకు పదే పదే సలహా ఇచ్చింది. వాణిజ్య నౌకల్లో సిబ్బందిగా పని చేసే భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విదేశాంగ శాఖ ఆదివారం కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది.
