పొల్యూషన్ ఎఫెక్ట్: ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మరణాలు

 పొల్యూషన్ ఎఫెక్ట్:  ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మరణాలు
  • కాలుష్యం కారణంగా 2019లో 23లక్షల మంది మృత్యువాత
  • రెండో స్థానంలో నిలిచిన చైనా
  • 2019లో ప్రపంచ వ్యాప్తంగా 90లక్షల మరణాలు
  • 2000తో పోలిస్తే 66శాతం అధికమైన కాలుష్య మరణాలు
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా కాలుష్యం స్థాయిలు 

కాలుష్యం కారణంగా 2019లో 23లక్షల మంది మృత్యువాత

కాలుష్యం కారణంగా దేశంలో 2.3మిలియన్ అంటే దాదాపుగా 23 లక్షల మంది 2019లో ప్రాణాలు కోల్పోయినట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్,  లాన్సెట్ కమిషన్ ఆఫ్ పొల్యుషన్ అండ్ హెల్త్ లో ప్రచురించింది. కలుషితమైన గాలి, విషపూరిత రసాయనాల వల్ల దేశ జీడీపీకి 1శాతం నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. అంతే కాకుండా 2019లో కేవలం పొల్యుషన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది చనిపోయినట్టు లాన్సెట్ ప్రకటించింది.

రెండో స్థానంలో నిలిచిన చైనా

కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 2019ఏడాదికి గానూ భారత్ మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానానికి పరిమితమైంది. కేవలం ఉపరితల వాయు కాలుష్యంతో భారత్ లో 17 లక్షల మరణాలు సంభవించగా, నీరు, ఇంటి లోపలి వాయు కాలుష్యం కారణంగా 2000సంవత్సరంలో జరిగిన మరణాల కంటే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

2000తో పోలిస్తే 66శాతం అధికమైన కాలుష్య మరణాలు

ఇకపోతే భారత్ తర్వాత చైనాలో కాలుష్యం కారణంగా 22 లక్షల మంది చనిపోగా, వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో 18 లక్షల మంది చనిపోయారు.  గృహ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే చాలా ఎక్కువగా కాలుష్యం స్థాయిలు ఉంటున్నాయని నివేదిక వెల్లడించింది. కాలుష్య మరణాల్లో 75 శాతం మరణాలకు వాయు కాలుష్యం కారణం అవుతోంది. లెడ్ లాంటి విష రసాయనాల కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మరణాలు సంభవించాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా కాలుష్యం స్థాయిలు 

ఇంట్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగా మరణాలు తగ్గడం కాస్త ఊరట కలిగించినా, పరిశ్రమల కాలుష్యం కారణంగా మాత్రం మరణాలు పెరిగినట్లు నివేదిక ప్రకటించింది.  నీరు, గాలి, నేల కాలుష్యం కారణంగా మానవాళిపై, భూమిపై తీవ్ర ప్రభావం పడుతోందని హెచ్చరించింది. భారత్, చైనా దేశాలు కాలుష్యం కారణంగా పెను ముప్పును ఎదుర్కొంటున్నాయని నివేదిక నొక్కి చెప్పింది. కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం భారత్ నియంత్రణ వ్యవస్థలను రూపొందించినా , వాటిని మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లడం కోసం అక్కడ కేంద్రీకృత వ్యవస్థ లేదని రిపోర్ట్ వెల్లడించింది. భారత్‌లోని 93 శాతం ప్రాంతంలో డబ్ల్యూహెచ్‌‌వో మార్గదర్శకాల కంటే ఎక్కువగా కాలుష్య సమస్య ఉందని తెలిపింది.