సాగుపై 2.5 లక్షల మంది రైతులకు అవగాహన : అగ్రివర్సిటీ వీసీ జానయ్య

సాగుపై 2.5 లక్షల మంది రైతులకు అవగాహన : అగ్రివర్సిటీ వీసీ జానయ్య

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ శాఖ సహకారంతో అగ్రికల్చర్​ వర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ట్లు శనివారం వీసీ జానయ్య తెలిపారు.  ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌‌ 27న  ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రైతు వేదికలో ప్రారంభినట్లు చెప్పారు. 4 వారాల పాటు రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 1,600 గ్రామాల్లో నిర్వహించామని తెలిపారు.

సుమారు 400 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వెయ్యి మంది విద్యార్థులు, 600 మంది వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొని దాదాపు రెండున్నర లక్షల మంది రైతులను ప్రత్యక్షంగా కలిశారని జానయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో తక్కువ యూరియా వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు, నేల పరిరక్షణ, అవసరమైన మేరకే రసాయనాల వినియోగం, పంట మార్పిడి విధానాల అనుసరణ, మార్కెట్‌‌లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు, సాగు నీటి పొదుపు, సేంద్రియ సాగు పద్ధతుల ప్రాముఖ్యత వంటి  కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు.