RGV : నిర్మాతలు కాదు.. కేవలం ఇన్వెస్టర్లు.. టాలీవుడ్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV : నిర్మాతలు కాదు.. కేవలం ఇన్వెస్టర్లు.. టాలీవుడ్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో సక్సెస్ కంటే ఫ్లాప్ లే  ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  టాలీవుడ్ లో పెరుగుతున్న భారీ బడ్జెట్లు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులపై ఓ ఇంటర్వ్యూలో కీలకవ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో అసలు సమస్య కథల్లో కాదు.. దర్శకుల బాధ్యత లేకపోవడంలో, నిర్మాతల అవగాహన లోపంలోనే ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. 

నిర్మాతలు కాదు.. కేవలం ఇన్వెస్టర్లు..

ఒక సినిమా బడ్జెట్ ఎలా తయారవుతుందో చాలామంది నిర్మాతలకు కూడా తెలియదు. దర్శకుడు ఎన్ని షాట్లు ప్లాన్ చేశాడు? ఎంత ప్రిపరేషన్ అవసరం? ఇవేవీ పూర్తిగా అర్థం కాకుండానే బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని వర్మ అన్నారు.. షూటింగ్ మొదలైన తర్వాత ప్లాన్ మారిపోతే ఖర్చు అదుపు తప్పుతుంది. అప్పటికే వెనక్కి తిరిగే పరిస్థితి ఉండదు అని అన్నారు . 

అంతేకాదు, బడ్జెట్ పెరిగితే బాధ్యత పూర్తిగా దర్శకుడిదేనని స్పష్టం చేశారు.డబ్బు ఎలా ఖర్చు చేయాలనేది నిర్ణయించేది దర్శకుడే. అతన్ని ప్రశ్నించకపోతే ఈ వ్యాపార మోడల్ ఎలా నడుస్తుంది? అంటూ సూటిగా నిలదీశారు. హిట్ సినిమా వచ్చినా నిర్మాతకు పెద్దగా లాభం మిగలకపోవడానికి కారణం కూడా ఇదేనని వర్మ అభిప్రాయపడ్డారు. అంతా నిర్మాణ ఖర్చుల్లోనే కరిగిపోతుంది. అందుకే ఇక్కడ వాళ్లను నిర్మాతలు అనడం కంటే ఇన్వెస్టర్లు అనడమే కరెక్ట్  అన్నారు. 

పని చేయకుండానే పారితోషికం..

ఈ సందర్భంగా ఓ సీనియర్ హీరోయిన్ గురించి కూడా చెప్పారు. పది రోజుల కాల్‌షీట్ ఇచ్చినా ఐదు, ఆరు రోజులు షూటింగ్‌కే పిలవలేదని, అయినా ఆమెకు సుమారు రూ.1 కోటి పారితోషికం మొత్తం చెల్లించారని వెల్లడించారు. పని చేయకుండా డబ్బు తీసుకోవడం సిగ్గుగా ఉందని ఆమె అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వాలని చెప్పింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. రూ.100 కోట్ల సినిమా రూ.200 కోట్లకు చేరినప్పుడు రూ.1 లేదా రూ.2 కోట్లు ఎవరికీ పెద్ద విషయం కాదు అని వ్యాఖ్యానించారు.

'కేజీఎఫ్ 2'లాంటి సినిమాలను మించి చేయాలనే పోటీ, మరింత గ్రాండ్ పాటలు, భారీ యాక్షన్ సన్నివేశాల కోసం జరిగే ఆరాటమే బడ్జెట్లను అమాంతం పెంచేస్తోందని వర్మ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో త్వరలోనే మనోజ్ బాజ్‌పేయి, జెనీలియా, రమ్యకృష్ణతో కలిసి తెరకెక్కుతున్న హారర్ కామెడీ 'పోలీస్ స్టేషన్ మేన్ భూత్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు.