చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపించి వారిని కిడ్నాప్ చేయడం లేదా వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు కొట్టేసే ఘటనలు సినిమాల్లో చాలాసార్లు చూశాం. తాజాగా ఇదే తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ మోసగాళ్లు బిస్కెట్లు, చాకెట్లు కాకుండా మోమోలు ఉపయోగించారు. మోమోలు అంటే పడి చచ్చేపోయే ఓ బాలుడిని టార్గెట్ చేసి మోసగించారు. ఇంట్లో నుంచి బంగారు నగలు తెచ్చి తమకిస్తే ఫ్రీగా మోమోలు ఇస్తామని ఆశ చూపించారు. మోమోలపై ఉన్న పిచ్చితో ఆ బాలుడు ఇంట్లోని రూ.85లక్షల విలువైన నగలు తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
వివరాల ప్రకారం.. డియోరియా-కస్య రోడ్డులోని దుమ్రీ చౌరాహా దగ్గర ముగ్గురు మోమోస్ స్నాక్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతోన్న ఓ బాలుడికి మోమోలు అంటే తెగా ఇష్టం. రోజు వీరి షాప్‌కు వెళ్లి మోమోస్ తినేవాడు. ఈ క్రమంలో షాప్ నిర్వాహకులైన ముగ్గురు యువకులకు బాలుడితో పరిచయం ఏర్పడింది. మోమోలపై బాలుడికి ఉన్న ఇష్టాన్ని ఆసరాగా చేసుకున్న యువకులు అతన్ని బురిడీ కొట్టించాలని పక్కా ప్లాన్ చేశారు.
ఇంట్లో నుంచి నగలు తెచ్చి తమకిస్తే మోమోలు ఉచితంగా ఇస్తామని ఆశ చూపించారు. మోమోలపై ఉన్న ప్రేమతో ఆ బాలుడు ఇంట్లో ఉన్న నగలు తెచ్చి వారికి ఇచ్చాడు. ఈ క్రమంలో బాలుడి సోదరి నా నగలు కనిపించడం లేదని తండ్రికి చెప్పింది. కొడుకు ప్రవర్తనపై అనుమానంచ తండ్రి గట్టిగా నిలదీశాడు. దీంతో భయపడ్డ బాలుడు అసలు విషయం చెప్పాడు. మోమోల కోసం నగలు తీసుకెళ్లి ముగ్గురు యువకులకు ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిశ్రా ఫిర్యాదు మేరకు రాంపూర్ కర్ఖానా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోమోల కోసం బాలుడు ఇంట్లో నుంచి తీసుకెళ్లి యువకులకు ఇచ్చిన నగల విలువ రూ.85 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు బయట ఎవరిని కలుస్తున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలను గమనించాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది స్కామ్ అంటే అంటూ పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
