ఈ సారి డిగ్రీలో 4.24 లక్షల సీట్లు

ఈ సారి డిగ్రీలో 4.24 లక్షల సీట్లు
  • పోయినేడాదితో పోలిస్తే పెరిగినయ్
  • ఓయూలో అధికంగా 1.65 లక్షలు
  • నేటితో ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు క్లోజ్
  • ఇప్పటి వరకు 1.12 లక్షల అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలో దోస్త్ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెరిగాయి. పోయినేడాది 4 ,12,805 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 4,24,315  సీట్లు ఉన్నాయి. కొత్తగా మరో 13 కాలేజీలు చేరగా, మొత్తంగా 11,510 సీట్లు పెరిగాయి. పోయినేడాదితో పోలిస్తే నాలుగు యూనివర్సిటీల్లో సీట్లు పెరగ్గా, రెండు వర్సిటీల్లో తగ్గాయి. స్టేట్​లో అత్యధికంగా ఓయూ పరిధిలో 418 కాలేజీల్లో 1,65,665 సీట్లు ఉండగా.. అత్యల్పంగా టీయూ పరిధిలో 66 కాలేజీల్లో 31,280  సీట్లు ఉన్నాయి. పోయినేడాదితో పోలిస్తే ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల్లో సీట్లు పెరగ్గా.. పాలమూరు, శాతవాహన వర్సిటీల్లో సీట్లు తగ్గాయి. ఓయూలో రెండు కాలేజీలు తగ్గినా సీట్లు పెరగడం గమనార్హం.

16న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

నేటితో దోస్త్ ఫస్ట్​ఫేజ్ రిజిస్ర్టేషన్లు ముగియను న్నాయి. అడ్మిషన్లకు అధికారులు ఆగస్టు 20న నోటిఫికేషన్ జారీ చేయగా, అదే నెల 24 నుంచి రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయి. సోమవారంతో రిజిస్ట్రేషన్లు, మంగళవారంతో వెబ్​ఆప్షన్ల ప్రాసెస్ ముగుస్తుంది. ఈ నెల16న ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి 1,41,553 మంది రిజిస్ర్టేషన్​ చేసుకోగా.. 1,12,870 మంది అప్లికేషన్లు సబ్మిట్ చేశారు. వీరిలో 83,526 మంది వెబ్​ఆప్షన్లు కూడా ఇచ్చారు. రిజిస్ర్టేషన్ చేసుకున్న వారిలో 1,37,425 మంది ఇంటర్ బోర్డు స్టూడెంట్స్​కాగా.. మరో 4,128 మంది ఇతర బోర్డులకు చెందిన వారున్నారు. ఆధార్​ఓటీపీ ద్వారా 74,441, టీ యాప్ పోలియో ద్వారా 26,683, మీ సేవ ద్వారా 40,424 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

కొత్త కోర్సులతో పెరిగిన సీట్లు

ఈ అకడమిక్ ఇయర్ కు గాను దోస్త్ పరిధిలో 1,059  కాలేజీలు ఉండగా.. వాటిలో 4,24,315 సీట్లు ఉన్నాయి. నాన్ దోస్త్ కాలేజీలు మరో వందకు పైగా ఉండగా, వాటిలో 40 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఈసారి కొత్తగా బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ కోర్సులను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రవేశపెట్టింది. బీఎస్సీ డేటాసైన్స్ కు 80 కాలేజీలకు, బీకాం అనలిటిక్స్​కు 85 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ కొత్త కోర్సులతోనే సీట్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.