మార్క్ మామూలోడు కాదు: వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పి.. తెల్లారుజామున లేఆఫ్ మెయిల్స్

మార్క్ మామూలోడు కాదు: వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పి.. తెల్లారుజామున లేఆఫ్ మెయిల్స్

ఈరోజు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అంటూ మెటా యాజమాన్యం నుంచి ఉద్యోగులకు సింపుల్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆఫీసుల్లో ఎలాంటి హడావుడి లేదు, కారిడార్లలో గుసగుసలు లేవు. టౌన్‌హాల్ సమావేశాల ఊసే లేదు. అంతా ప్రశాంతం. అయితే ఈ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫాను దాగుందని ఉద్యోగులు మెటా ఉద్యోగులు ఊహించలేకపోయారు. ఇళ్లల్లో ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చున్న సిబ్బందికి కొద్దిసేపట్లోనే అసలు కథ అర్థమైంది. మార్క్ జూకర్‌బర్గ్ సైలెంటుగా వేల మంది ఉద్యోగులను ఎలా షాక్ కి గురిచేసారు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికా, బ్రిటన్, సింగపూర్.. ఇలా ప్రపంచవ్యాప్తంగా టైమ్ జోన్‌ల వారీగా ఉద్యోగుల ఇన్‌బాక్స్‌ల్లోకి లేఆఫ్ మెయిల్స్ రావడం మొదలైంది. సింగపూర్ హబ్‌లో తెల్లవారుజామున 4 గంటలకే మొదటి మెయిల్స్ ల్యాండ్ అయ్యాయి. మొత్తం 78వేల మంది సిబ్బంది ఉన్న మెటా.. దాదాపు 10 శాతం మంది అంటే 8వేల మంది ఉద్యోగులను ఒకే దెబ్బకు తొలగించింది. ఆఫీసుల్లో ఎలాంటి గొడవలు, నిరసనలు జరగకుండా ఉండేందుకే మెటా వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యూహాన్ని ఎంచుకుందని ఉద్యోగులు అంటున్నారు. 

ఈ లేఆఫ్స్ వెనుక అసలు కారణం.. మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం. అదే 'AI ఫస్ట్'. కేవలం ఉద్యోగాల కోత మాత్రమే కాదు.. మరో 7వేల మంది ఉద్యోగులను కొత్త AI-నేటివ్ టీమ్స్‌లోకి మారుస్తున్నారు మెటాలో. అలాగే 6వేల ఓపెన్ పొజిషన్లను పూర్తిగా రద్దు చేశారు. చిన్న చిన్న టీమ్స్‌తో, తక్కువ మేనేజర్లతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకే ఈ ఫ్లాటర్ స్ట్రక్చర్ తెస్తున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ అంతర్గత మెమోలో స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌పైనే ఈ ప్రభావం ఎక్కువగా పడిందని వెల్లడించారు.

గత నెలలోనే ఈ లేఆఫ్స్ వివరాలు లీక్ అవ్వడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది ఉద్యోగులు ముందే ఊహించి ఆఫీసుల్లోని ఉచిత స్నాక్స్, ల్యాప్‌టాప్ ఛార్జర్లను సర్దేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఉద్యోగుల మౌస్ మూవ్‌మెంట్స్, కీబోర్డ్ స్ట్రోక్స్‌ను ట్రాక్ చేస్తూ AI ట్రైనింగ్ కోసం వాడుతున్న ఒక టూల్‌పై వెయ్యి మందికి పైగా ఉద్యోగులు నిరసన పిటిషన్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే.

ఇది తాత్కాలిక ఆర్థిక సంక్షోభం కాదని, జనరేటివ్ AI.. అటానమస్ టూల్స్ రావడంతో రొటీన్ సాఫ్ట్‌వేర్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులకు మనుషుల అవసరం తగ్గిపోయిందని రెడ్‌క్యూ సీఈఓ దీపాల్ దత్తా అన్నారు. టెక్ కంపెనీల వృద్ధి ఇకపై ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉండదని, ఉద్యోగుల సంఖ్య తగ్గించడం.. AI పై పెట్టుబడులు పెంచడం.. ఇదే ఇప్పుడు గ్లోబల్ టెక్ మంత్ర అని దత్తా చెబుతున్నారు.