పోలీస్‌‌ విధుల్లో కి 42 జాగిలాలు

పోలీస్‌‌ విధుల్లో కి 42 జాగిలాలు
  •     క్రిమినల్స్ ట్రాకింగ్‌‌, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను ట్రేస్‌‌ చేయడంలో ట్రైనింగ్‌‌
  •     మొయినాబాద్‌‌ అకాడమీలో ఎనిమిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 72 కెనైన్స్‌‌ 
  •     ఆకట్టుకున్న జాగిలాల పరేడ్‌‌, విన్యాసాలు

హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో 42 కెనైన్స్‌‌ (పోలీస్ డాగ్స్) విధుల్లో చేరాయి. నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు పేలుడు పదార్థాలు, నార్కొటిక్స్‌‌ ను గుర్తించడంలో 8 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. పోలీసులకు తోడుగా డిపార్ట్‌‌మెంట్‌‌లో సేవలు అందించనున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో(ఐఐటీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 25వ బ్యాచ్‌‌ పోలీస్ జాగిలాలు (కెనైన్స్) మంగళవారం పరేడ్ నిర్వహించాయి.

తెలంగాణకు చెందిన 42 జాగిలాలు, బిహార్ సీఐడీకి చెందిన 30, సీఐఎస్ఎఫ్‌‌కు చెందిన 4 జాగిలాలు  సహా మొత్తం 72 జాగిలాలు, 105 మంది హ్యాండ్లర్ల పరేడ్‌‌, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌‌, అడిషనల్‌‌ డీజీ విజయ్‌‌కుమార్‌‌, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌‌ (ఐఎస్‌‌డబ్ల్యూ) ఓఎస్‌‌డీ వీబీ కమలాసన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

కెనైన్స్‌‌ హ్యాండ్లర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రైనింగ్‌‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాలు లియో, చార్లీ, రాకీలకు వాటి హ్యాండ్లర్లు పురస్కారాలు అందించారు. జాగిలాలు చేసిన పరేడ్‌‌, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ విజయ్‌‌కుమార్ మాట్లాడుతూ.. జాగిలాలు కేవలం జంతువులు మాత్రమే కాదని, నేర పరిశోధనలో పోలీసులకు అత్యంత నమ్మకమైన, క్రమశిక్షణ కలిగిన భాగస్వాములని కొనియాడారు. నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు పేలుడు పదార్థాలు, నార్కొటిక్స్‌‌ను గుర్తించండం, వీఐపీలు, వీవీఐల భద్రతలో అత్యత్తమ ప్రతిభ కనబర్చుతున్నాయని అన్నారు. 

919 జాగిలాలు.. 1,310 మంది హ్యాండ్లర్లకు అత్యుత్తమ శిక్షణ

ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటైన తర్వాత 2004 నుంచి ఈ ఏడాది వరకు 25 బ్యాచ్‌‌లకు చెందిన మొత్తం 919 పోలీస్ జాగిలాలు.. 1,310 మంది హ్యాండ్లర్లు శిక్షణ పొందారు. ఇందులో తెలంగాణ, బిహార్, గోవా, త్రిపురకు చెందిన డాగ్‌‌ స్క్వాడ్‌‌, సీఐఎస్ఎఫ్, ఆర్పీఎఫ్‌‌ కెనైన్స్‌‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లాబ్రడ్‌‌ రిట్రీవర్స్, జర్మన్ షెప్పర్డ్, బెల్జియం మాలినోస్, కోకోర్ స్పైనల్, గోల్డెన్‌‌ రిట్రీవర్‌‌‌‌ జాతులకు చెందిన జాగిలాలు ట్రైనింగ్ పొందాయి. 

ఇంటెలిజెన్స్,సెక్యూ రిటీ వింగ్‌‌ కావలసిన విధంగా స్నిఫర్, ట్రాకర్‌‌‌‌లకు అత్యుత్తమ శిక్షణ అందించారు. 8 నెలల ట్రైనింగ్‌‌లో మొదటి 2 నెలలు లవ్ అండ్ ఎఫెక్షన్, మరో 2 నెలలు గ్రూమింగ్ అంటే హాండ్లర్‌‌‌‌పై ఆకర్షణ కలిగే విధంగా చేస్తారు. ఆ తరువాత 4 నెల్లలో పోలీస్ రెస్పెక్ట్, సెల్యూట్‌‌ చేయడంతో పాటు పేలుడు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, నేరస్తులను గుర్తించడంలో ఆధునిక తరహాలో ట్రైనింగ్ పూర్తి చేశారు. 

25వ బ్యాచ్‌‌లో ఎక్స్‌‌ప్లోజివ్ విభాగంలో సీఐఎస్ఎఫ్‌‌కు చెందిన వి. భాస్కర రావు (జాగిలం లియో), నార్కొటిక్ విభాగంలో బిహార్ సీఐడీకి చెందిన సుదర్శన్ కుమార్ (జాగిలం చార్లీ), ట్రాకర్ విభాగంలో రామగుండంకు చెందిన ఎం. శ్రీనాథ్ (జాగిలం రాకీ) ప్రథమ బహుమతులు సాధించారు. ఫిజికల్ పెర్ఫార్మెన్స్ టెస్టులో కరీంనగర్ కు చెందిన బీ నితిన్ మొదటి స్థానంలో నిలవగా, వివిధ బ్రీడ్‌‌ల అజిలిటీ విభాగంలో సింతు కుమార్, బి. కృష్ణ, విశాల్ కుపాలే, వి. కుమారస్వామి, బి. నరేశ్ బాబు తమ జాగిలాలతో ప్రతిభ చాటారు.