Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా 2–1 ఆధిక్యంలో కొనసాగుతోంది. లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించగా, రాంచీలో జరిగిన రెండో టీ20లో విండీస్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. కానీ, ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ 14 రన్స్ తేడాతో గెలుపొంది మళ్లీ లీడ్‌లోకి దూసుకెళ్లింది. అయితే హైదరాబాద్ వేదికగా రేపు (బుధవారం, అక్టోబర్ 14) జరగనున్న నాలుగో టీ20కి ముందు, టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సిరీస్ గెలిచాక.. వైభవ్‌కు అవకాశం ఇవ్వండి:
* వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ, రాబోయే మ్యాచ్‌లలో భారత్ ముందుగా సిరీస్‌ను కైవసం చేసుకుని, ఆఖరి మ్యాచ్‌లో వైభవ్‌ను బరిలోకి దించాలని అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లకు మేనేజ్‌మెంట్ మద్దతు ఇస్తుండటంతో.. ముందుగా టీమిండియా 3–1తో సిరీస్‌ను దక్కించుకోవాలి, ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో అవకాశం ఇవ్వాలని నాయర్ పేర్కొన్నారు.
అభిషేక్ శర్మ అద్భుతమైన రీఎంట్రీ: నాయర్
* తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. మూడో టీ20లో 69 పరుగులతో (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో అభిషేక్ ఎదుర్కొన్న సవాళ్లను అభిషేక్ నాయర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
* మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో అభిషేక్ పెవిలియన్ చేరాడు, కానీ మూడో మ్యాచ్‌లో అతను క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకొని, బౌలర్ వ్యూహాలను తిప్పికొట్టాడని వివరించాడు.
* ఒకసారి మీరు క్రీజులో 5, 6 బంతులు ఆడితే, బౌలరే మీ వెనుక పరిగెత్తాల్సి వస్తుంది.. అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే విధ్వంసం సృష్టించగలడు, కానీ అవసరమైనప్పుడు సమయం తీసుకొని ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేసుకోవాలని అభిషేక్ నాయర్ వెల్లడించాడు.
