ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ వేస్ట్: 5 గంటల పాటు డాక్టర్ల సర్జరీ

ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ వేస్ట్: 5 గంటల పాటు డాక్టర్ల సర్జరీ

చెన్నై: ప్లాస్టిక్ కవర్లు, చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయడం.. ఓ జీవి ప్రాణం మీదికి వచ్చింది. ఆహార పదార్థాలు ఉంచి పడేసిన కవర్లను తిని ఆవు అల్లాడిపోయింది. నోరు తెరిచి చెప్పలేని మూగ జీవి బాధను అర్థం చేసుకుని యజమాని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు దాదాపు ఐదున్నర గంటలు కష్టపడి సర్జరీ చేసి.. దాన్ని కాపాడారు. ఏకంగా 52 కిలోల ప్లాస్టిక్ వేస్ట్ ను దాని కడుపులో నుంచి తీశారు. అందులో కొన్ని ఇనుప మేకులు, కాయిన్స్ కూడా ఉన్నాయి.

ఆవును నిలబెట్టే సర్జరీ

తమిళనాడు రాజధాని చెన్నైలోని వెటర్నరీ అండ్ ఎనిమల్ సైన్సెస్ యూనివర్సిటీలో ఈ సర్జరీ జరిగింది. డాక్టర్ వేలవన్, డాక్టర్ శివశంకరన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం టీం ఐదున్నర గంటల పాటు నిలబడి ఆపరేషన్ చేశారు. ఆవును నిలబెట్టి.. దాని కడుపుపై మాత్రమే అనస్తీషియా (మత్తు మందు) ఇచ్చి ప్లాస్టిక్ వేస్ట్ బయటకు తీశారు. దాని కడుపు 75 శాతం ప్లాస్టిక్ తో నిండిపోయిందని, తమ వర్సిటీలో జరిగిన సర్జరీల్లో 52 కేజీల ప్లాస్టిక్ బయటకు తీయడం ఇదే తొలిసారని చెప్పారు డాక్టరు. ఐదు గంటల్లోనే ఆవు పూర్తిగా కోలుకుంటుందని చెప్పారు.

 

తమిళనాడులోని తిరుమలైవాయల్ ప్రాంతానికి చెందిన మునిరత్నం అనే రైతుకు చెందిన ఆవు ఇది. ఆరు నెలల క్రితమే దీన్ని వేరొకరి వద్ద కొన్నానని చెప్పాడు మునిరత్నం. కొద్ది రోజులుగా సరిగ్గా మేత మేయకపోవడం, పెండ కూడా వేయకపోవడంతో దాని బాధ అర్థమై డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లానని చెప్పాడు.