రాత్రి లాటరీ టికెట్ కొన్నారు.. పొద్దున కోటీశ్వరులయ్యారు

రాత్రి లాటరీ టికెట్ కొన్నారు.. పొద్దున కోటీశ్వరులయ్యారు

అదృష్టవంతులంటే వీళ్లే.. నిన్నటి వరకు సేల్స్ మెన్.. నేడు కోటీశ్వరులయ్యారు. బంపర్ లాటరీ డ్రా పొద్దున ఉందనగా.. రాత్రి టికెట్లు కొన్నారు. తెల్లారి చూస్తే ఆ లాటరీ గెలుచుకున్న లక్కీ విన్నర్స్ వాళ్లే అయ్యారు. ఏకంగా రాత్రికి రాత్రి రూ.12 కోట్ల లాటరీని గెలుచుకున్నారు. ఇప్పటికీ దీన్ని తామే నమ్మలేకపోతున్నామంటున్నారా సేల్స్ మెన్ కం కరోడ్ పతులు.

కేరళలోని కొల్లాం జిల్లా కరుణాగపల్లిలో ఓ జువెలరీ షాప్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నారా ఆరుగురు మిత్రులు. వారి పేర్లు రాజీవన్, రాంజిమ్, రోనీ, వివేక్, సుబిన్, రతీష్. వీరంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి సేల్స్ మెన్ గా పని చేస్తున్నారు. తొలుత సుబిన్ మరో ఇద్దరు స్నేహితులు కలిసి తిరువోనం బంపర్ లాటరీ టికెట్ కొనాలని అనుకున్నారు. బుధవారం రాత్రి టికెట్ అమ్మకం గడువు ముగుస్తుందనగా.. వారు మరో ముగ్గురిని కూడా అడిగారు. అంతా కలిసి ఆ రోజు రాత్రి హడావిడిగా టికెట్ కొనేశారు. గురువారం ఉదయం యథావిధిగా డ్యూటీకి  వెళ్లి పని చేసుకుంటున్నారు.

ఆ సమయంలో గురువారం ఉదయమే ఆ బంపర్ లాటరీ విన్నర్స్ ని ప్రకటిస్తారని తెలిసిన ఓ సహోద్యోగి వారు టికెట్ కొన్న విషయం తెలిసి ‘మీ టికెట్ నంబర్ చెప్పండి’ అని అడిగి చెక్ చేశాడు. హహా.. ఆఆఆ… మీరే విన్నర్స్ అంటూ గట్టిగా అరిచాడు. కానీ ముందు ఆటపట్టిస్తున్నాడని వారు నమ్మలేదు.

నేమ్మదిగా వాళ్లే చెక్ చేస్తే అది నిజమేనని తెలుసుకున్నారు. రాత్రికి రాత్రి 12 కోట్ల లాటరీ తగిలిందన్న విషయం నమ్మలేక షాక్ లో ఉండిపోయారు. ఆనందం పట్టలేక ఆ ఆరుగురు ఎగిరి గంతేశారు. పన్నలు పోనూ వారి రూ.7.5 కోట్లు చేతికి వస్తాయి. ఈ సొమ్ముతో ముందుగా తమకు ఉన్న అప్పులు తీర్చుకుంటామని వారు చెబుతున్నారు. జీవితంలో మంచిగా సెటిల్ అవుతామని, కొంత సొమ్ము సమాజ సేవకు ఖర్చు చేస్తామని చెప్పారు.

లాటరీ సంస్థ ఆ రూ.12 కోట్లలో టికెట్ అమ్మిన ఏజెంట్ కు కమీషన్ గా రూ. కోటి ఇస్తుంది. అలాగే ఇదే లాటరీ స్కీంలో రూ.50 లక్షల చొప్పున మరో పది, రూ.10 లక్షల చొప్పున మరో 20 టికెట్లకు ప్రైజ్ మనీ ప్రకటించింది.