60 శాతం కూరగాయలు దిగుమతే

60 శాతం కూరగాయలు దిగుమతే

ఇతర రాష్ట్రాల నుంచే పాలు, పప్పులు, నూనెలు కూడా 
బయటి నుంచి రోజూ 10 లక్షల లీటర్ల పాలు వస్తున్నయ్ 
6 లక్షల టన్నుల నూనెకు గాను లక్ష టన్నులే మన దగ్గర ఉత్పత్తి 
కూరగాయలు, పప్పులు, నూనె గింజల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వని సర్కార్ 


హైదరాబాద్‌‌ : మనకు రోజు వారీగా అవసరమైన వాటికోసం ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కూరగాయలు మొదలు పాలు, పప్పులు, నూనెల వరకు అన్నీ దిగుమతి చేసుకుంటున్నం. రాష్ట్రానికి అవసరమయ్యే కూరగాయల్లో 60 శాతం ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ఏటా 41.75 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా, రాష్ట్రంలో 23.46 లక్షల టన్నులు మాత్రమే పండుతున్నాయి. అంటే 18 లక్షల టన్నులకు పైగా కొరత ఉంటోంది. టమాట, కాకరకాయ, బీరకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, సొరకాయ, బీన్స్‌‌, క్యాప్సికం తదితర కూరగాయలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరలు రాష్ట్రంలో తగినంత సాగు కావడం లేదు. టమాట హైదరాబాద్ లోని బోయిన్ పల్లి మార్కెట్ కు రోజూ 50 నుంచి 100 లారీలు వస్తోంది. ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కర్నాటకలోని బెంగుళూరు, చింతామణి, బాగేపల్లి, గుల్బర్గా, మహారాష్ట్రలోని సోలాపూర్‌‌ నుంచి టమాటా దిగుమతి అవుతోంది. ఉత్తరప్రదేశ్‌‌లోని ఆగ్రా నుంచి ఆలుగడ్డ,  మహారాష్ట్రలోని సోలాపూర్‌‌, సాంగ్లీ నుంచి, ఏపీలోని కర్నూలు నుంచి రోజూ వందలాది లారీల ఉల్లిగడ్డ మలక్‌‌పేట్‌‌ మార్కెట్‌‌కు వస్తోంది. క్యారెట్, క్యాప్సికం కర్నాటకలోని మల్లూరు, బాగల్‌‌కోట్‌‌, చిక్‌‌బల్లాపూర్‌‌, హస్‌‌కోట నుంచి వస్తోంది. పచ్చి మిర్చి ఏపీలోని అనంతపురం, కర్నూల్‌‌, గుత్తి, ఆదోని, కర్నాటకలోని బల్లారీ, మహారాష్ట్రలోని జాల్‌‌గాం, చత్తీస్‌‌గఢ్ లోని జగదల్‌‌ పూర్‌‌ నుంచి వస్తోంది. 

పాలు సాల్తలేవు..

రాష్ట్రంలో రోజువారీ పాల వినియోగం 36 లక్షల లీటర్లు కాగా.. ఇక్కడ ఉత్పత్తి అవుతోంది 26 లక్షల లీటర్లే. రోజూ 10 లక్షల లీటర్ల వరకు ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సహకార సంఘాల ద్వారా నడిచే విజయ, ముల్కనూర్‌‌, కరీంనగర్‌‌, మదర్‌‌ డెయిరీలన్నీ కలిపి రోజూ 7 లక్షల లీటర్ల పాలను మార్కెట్‌‌లో విక్రయిస్తున్నాయి.  ఇందులో విజయ డెయిరీ అమ్మేది 4 లక్షల లీటర్లు. అయితే ఈ 4 లక్షల లీటర్లలోనూ విజయ డెయిరీ వద్ద సరిపోను లేక.. 2 లక్షల లీటర్లు కర్నాటక, మహారాష్ట్రల నుంచి తెప్పించుకొని సరఫరా చేస్తోంది. ఏపీ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ నుంచి కూడా మన రాష్ట్రానికి పాలు దిగుమతి అవుతున్నాయి. ఇక పప్పులు, నూనెలు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర అవసరాలకు ఏటా 6.4 లక్షల టన్నుల వంటనూనె అవసరం కాగా.. కేవలం లక్ష టన్నులు మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. మిగతా మొత్తం దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఇక కందిపపప్పు, శనగపప్పు, మినపప్పు ఇతర రాష్ట్రాల నుంచే వస్తోంది. ఏపీ, తమిళనాడు నుంచి మినప పప్పు, బెంగాల్ నుంచి శనగపప్పు, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి కందిపప్పు, ఏపీ నుంచి పెసరపప్పు దిగుమతి అవుతోంది. 

గొర్రెలిచ్చినా మటన్ ధర తగ్గలే..  

రాష్ట్రంలో 2017 నుంచి గొల్ల, కురుమలకు 3.93 లక్షల యూనిట్ల గొర్రెలు అంటే దాదాపు 82.53 లక్షల గొర్రెలను సర్కార్ పంపిణీ చేసింది. కానీ రాష్ట్రంలో మటన్ ధర తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతూ కిలో రూ.వెయ్యికి దగ్గరవుతోంది. మహారాష్ట్ర, రాజస్తాన్, ఏపీ, కర్నాటక నుంచి రోజుకు 50 నుంచి 60 లారీల దాకా గొర్ల లోడ్లు హైదరాబాద్ కు వస్తున్నాయి.

ప్రోత్సాహకాలు ఇవ్వని సర్కార్.. 

రాష్ట్రంలో కూరగాయలు, పప్పులు, నూనె గింజల పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. కనీసం విత్తనాలు కూడా సబ్సిడీపై పంపిణీ చేయడం లేదు. రాష్ట్రంలో వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు అవకాశం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. పామాయిల్ రైతులకు ప్రోత్సహకాలు ఇస్తామని చెప్పిన సర్కార్.. బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కూడా పెట్టింది. కానీ ఇప్పటి వరకు రైతులకు రూపాయి ఇవ్వలేదు.