9 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

9 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు
  • రేషనలైజేషన్ తో పోస్టులు తగ్గే అవకాశం
  • ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీకి, రేషనలైజేషన్​కు రాష్ట్ర ప్రభుత్వం ముడిపెడుతున్నట్టు తెలుస్తున్నది. అందుకే టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కావాలనే లేట్ చేస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. టెట్ ఫలితాలొచ్చి 6 నెలలైనా.. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. టీచర్లు, స్కూళ్ల రేషనలైజేషన్ చేస్తే పోస్టులు మరింత తగ్గే చాన్స్ ఉంది. ఆ ప్రక్రియ తర్వాతే టీచర్ పోస్టులను నింపే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

2017లో లాస్ట్​ నోటిఫికేషన్

రాష్ట్రంలో 26 వేలకుపైగా సర్కారు స్కూళ్లు ఉండగా.. వాటిలో 1.07 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో 8,792 పోస్టులు భర్తీ చేసింది. ఆ తర్వాత ఇప్పటి దాకా ఒక్క పోస్టు కూడా నింపలేదు. 2015లో రేషనలైజేషన్ చేసిన తర్వాతే, టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఆ టైమ్​లో పిల్లలు లేరనే కారణంతో వందలాది స్కూళ్ల​ను ప్రభుత్వం మూసివేసింది. ఆ టీచర్ పోస్టులను డీఈవోల పూల్​లో పెట్టింది. దీంతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వందలాది పోస్టులు సర్​ప్లస్ పోస్టులుగా మిగిలిపోయాయి. వాటిని ఇప్పటికీ అధికారిక లెక్కల్లోకి తీసుకోవడం లేదు. మరోపక్క, సుమారు 13 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రానికి లెక్కలు పంపించారు. 6 నెలల కింద పంపిన లిస్ట్​లో సెకండరీ ఎడ్యుకేషన్​లో 1,384 పోస్టులే భర్తీ చేయాల్సి ఉందని చెప్పింది. ఇంకోపక్క స్కూళ్లలో టీచర్లు, స్టూడెంట్ల నిష్పత్తితో పోలిస్తే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​లోనే 9,221 పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రేషనలైజేషన్ చేస్తే భారీగా పోస్టులు తగ్గే అవకాశం ఉంది.

ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇయ్యలే

కరోనాకు ముందు సర్కారు బడుల్లో 16 వేల మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. ప్రస్తుతం వారిని తీసేసి, ఉన్న టీచర్లనే అడ్జెస్ట్ మెంట్ చేశారు. వీవీలు లేకపోవడంతో చాలాచోట్ల సబ్జెక్టు టీచర్లు లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క 9 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​కు ఫైల్ పంపించారు. వాటిలో ఎన్ని పోస్టులను నింపుతారో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. రేషనలైజేషన్ చేస్తే ఆ సంఖ్య తగ్గే చాన్స్ ఉంది. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని, అప్పట్లో సర్కారు పెద్దలు ప్రకటించారు. కానీ, ఫలితాలు వచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.

టీఆర్టీ కోసం పెరిగిన పోటీ

టెట్ రాసిన లక్షలాది మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. టీఆర్టీ నిర్వహించి ఐదేండ్లు కావడంతో, గతం కంటే పోస్టులకు పోటీపడే వారి సంఖ్య పెరుగుతుంది. గ్రూప్స్ తో పాటు వివిధ రకాల పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ అనుమతి ఇస్తున్నా.. టీచర్ పోస్టుల విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నది. టీచర్ పోస్టుల భర్తీని టీఎస్​పీఎస్సీ ద్వారా కాకుండా.. స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారానే చేపట్టేందుకు దాదాపు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పోస్టులు తగ్గించకుండా.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.