నర్సింగ్ ఎగ్జామ్​కు 94 శాతం హాజరు

నర్సింగ్ ఎగ్జామ్​కు 94 శాతం హాజరు
  • పరీక్షకు 38,674 మంది హాజరు
  • 5,204 పోస్టులకు 40,936 మంది అప్లై


హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్‌‌ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్‌‌ సర్వీసెస్ బోర్డు బుధవారం నిర్వహించిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందని నర్సింగ్ అభ్యర్థులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు సెషన్లలో ఆన్‌‌లైన్‌‌లో(కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్‌‌) ఎగ్జామ్ జరిగింది. ఉదయం, సాయంత్రం సెషన్లలో వచ్చిన ప్రశ్నల కంటే మధ్యాహ్నం సెషన్​లో కొంత కఠినంగా వచ్చాయని చెబుతున్నారు. 

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌‌, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో మొత్తం 39 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. 5,204 పోస్టులకు 40,936 మంది అప్లై చేసుకోగా.. 38,674 మంది (94.47 శాతం) పరీక్షకు హాజరయ్యారు. కొన్ని చోట్ల టైమ్​కు పేపర్ ఓపెన్ కాకపోవడం, కంప్యూటర్స్ ఆన్‌‌ కాకపోవడం వంటి చిన్న చిన్న పొరపాట్లు తప్ప, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని బోర్డు ప్రకటించింది. 

వెయిటేజీ మార్కులపై మళ్లీ లొల్లి తప్పదా..
గతంలో జరిగిన నర్సింగ్ రిక్రూట్‌‌మెంట్‌‌లో అనేక అవకతవకలు జరిగాయి. అర్హత లేని వాళ్లకు కూడా వెయిటేజీ మార్కులు కలిపిన ఆఫీసర్లు రూ.కోట్లు వెనకేసుకున్నారు. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి, 2021లో రిజల్ట్స్ ఇచ్చిన సర్కార్, అవినీతిపరులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి గందరగోళానికి తెరలేపేలా ఎగ్జామ్ విధానాన్ని తీసుకొచ్చారని నర్సింగ్ అభ్యర్థులు విమర్శిస్తున్నారు. ఒకేసారి 41 వేల మందికి ఆన్‌‌లైన్‌‌లో ఎగ్జామ్ పెట్టేందుకు ఫెసిలిటీస్​ లేనందున మూడు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించామని బోర్డు చెబుతున్నది. 

ఒక్కో సెషన్​లో ప్రశ్నపత్రం ఒక్కో రకంగా ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇలా జరగుతుందని ముందే ఊహించిన బోర్డు, ఏదైనా సెషన్​లో క్వశ్చన్ పేపర్ టఫ్‌‌గా వస్తే కటాఫ్ మార్కులను తగ్గిస్తామని గతంలోనే ప్రకటించింది. ఇందుకోసం గందరగోళంగా ఉన్న ఓ నార్మలైజేషన్‌‌ ఫార్ములాను రెండు నెలల క్రితమే ప్రకటించింది. మ్యాథ్స్‌ తో సంబంధం లేని నర్సులకు ఏ మాత్రం అర్థంకాని విధంగా ఈ మెథడ్‌‌ ఉంది. ఇది నర్సుల్లో గందరగోళానికి, అనుమానులకు తావిచ్చేలా ఉన్నదని నర్సింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 

కరీంనగర్‌‌‌‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌‌, సిద్దిపేట, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌‌నగర్‌‌‌‌లోనూ ఆన్‌‌లైన్ ఎగ్జామ్స్ పెట్టేందుకు వసతులు ఉన్నాయి. కానీ, ఈ జిల్లాలను ఎంపిక చేయకుండా, హైదరాబాద్‌‌, వరంగల్‌‌, ఖమ్మం, నిజామాబాద్‌‌లో మాత్రమే ఎగ్జామ్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.