పొట్టకూటి కోసం కరెంటు స్తంబాలపై పని చేస్తున్న బాలుడు

పొట్టకూటి కోసం కరెంటు స్తంబాలపై పని చేస్తున్న బాలుడు

హైదరాబాద్ : బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించాల‌ని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇది పూర్తి స్థాయిలో సాధ్యం కావడంలేదు. ఎక్కడో చోట 18 సంవత్సరాలు దాటకుండానే బాల కార్మికులు పని చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బాల కార్మికుడు కరెంటు స్తంబాలెక్కుతూ వైర్లు రిపేరింగ్ చేస్తుండటంతో ఓ వ్యక్తి వీడియో తీశారు. పట్టుమని పదహారేళ్ల కూడా నిండని బాలుడు ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ లో కరెంటు స్తంభాలపై తీగలు రిపేరింగ్ చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర 15 ఏళ్ల బాలుడు పని చేస్తున్నాడు. స్తంభాలపైన అటూ ఇటూ నడుస్తూ చకచకా పనులు చేస్తున్నాడు. ఇది గమనించిన స్వచ్ఛంద సంస్థకు చెందిన ఘనశ్యాం ఓజా అనే వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు.

ఆ బాలుడి వయసు గురించి ఆరా తీశారు. ముందుగా తనకు 15 ఏళ్లు అని చెప్పిన బాలుడు.. తాను పనిచేసే కాంట్రాక్టర్ కు ఇబ్బంది వస్తుందని 16 ఏళ్ల వయసు దాటి 17లోకి ఎంటర్ అయ్యానని చెప్పాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు కుటుంబం గడవడం కోసం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నాడు. దీనిపై కాంట్రాక్టర్ శంకర్ ను నిలదీయగా .. తమ పరిస్థితి ఇలా ఉంది ఏం చేద్దామని ఎదురు ప్రశ్నించాడు. ఇలా ఫోటోలు తీసే బదులు బాలుడిని తీసుకెళ్ళి పోషించవచ్చు కదా అంటూ వీడియో తీసిన వ్యక్తిని ప్రశ్నించాడు.

ఓవైపు స్థంభంపై బాలుడు పని చేస్తుంటే.. తొందరగా కిందకు రావాలని మరో చోటికి వెళ్లాలంటూ కాంట్రాక్టర్ పురమాయించడం, ఆ బాలుడు ఎంతో ఓ అనుభవం ఉన్న వర్కర్ లాగా అక్కడ పని చేస్తూ కిందకు దిగి రావడం చూసినవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది. 14 ఏళ్లలోపు పిల్లలు అందరూ బాలకార్మికుల కేటగిరిలోకి వస్తారు. అదేవిధంగా 18 ఏళ్ల లోపు వయసు వాళ్లను ఇలాంటి ప్రమాదకర పనిస్థలంలో పని చేయించడం నేరం అయినప్పటికీ .. దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్త మవుతున్నాయి.