మీరు పనిమీద బ్యాంక్ కు వెళుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. లేదంటే కేటుగాళ్లు నడిపిస్తున్న డూప్లికేట్ బ్యాంక్ ల చేతిలో మోసపోవాల్సిందే.
పని పాటా లేని ఓ 19 ఏళ్ల జులాయి సొంతంగా ఎస్బీఐ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు. పార్ట్ నర్లుగా రబ్బర్ స్టాంప్ లను తయారు చేసే ఓనర్ ను , ప్రింటింగ్ ప్రెస్ యజమానితో కలిసి బ్యాంక్ ను రన్ చేస్తున్నాడు. బ్యాంక్ పెట్టిన మూడు నెలల తరువాత కానీ బయట పడలేదు. అది ఎస్బీఐ బ్యాంక్ కాదని, జులాయిగా తిరిగే ఓ 19ఏళ్ల యువకుడు మాస్టర్ మైండ్ తో పెట్టిన డూప్లికేట్ బ్యాంక్ అని. అందుకే బ్యాంక్ కు వెళితే కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇండియా టుడే కథనం ప్రకారం.. తమిళనాడులో ఘరానామోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. కడలూరు పన్రూతికి చెందిన కమల్ బాబు(19) తల్లిదండ్రులు బ్యాంక్ ఉద్యోగులుగా పనిచేసేవారు. కమల్ తండ్రి పదేళ్ల క్రితం మరణించగా..తల్లి రెండేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు.
అయితే నిందితుడు పనిపాట లేకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో నిందితుడికి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని , రాత్రి రాత్రే కోటీశ్వరుడు కావాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడువుగా తన స్నేహితులైన రబ్బర్ స్టాంప్ ఓనర్ మనిస్కం (52), ప్రింటింగ్ ప్రెస్ యజమాని కుమార్ (42)తో కలిసి కడలూరు జిల్లా పన్రుతిలో ఎస్బీఐ డూప్లికేట్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు.
బ్యాంక్ పెట్టిన రెండు నెలల తరువాత పన్రుతికి చెందిన ఓ కష్టమర్ కు అనుమానం రావడంతో..ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. కష్టమర్ ఫిర్యాదుతో అప్రమత్తమైన జోనల్ మేనేజర్..బ్రాంచ్ ల ఏర్పాటు పై జోనల్ బ్రాంచ్ లకు చెందిన బ్యాంక్ మేనేజర్లని వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. పన్రుతిలో ఎస్బీఐ బ్రాంచ్ లు రెండు ఉన్నాయని అడ్రస్, వివరాలతో సహా వెల్లడించారు. మూడో ఎస్బీఐ బ్రాంచ్ డూప్లికేట్ అని నిర్ధారించుకొని పోలీసుల సాయంతో ఆ బ్యాంక్ పై దాడులు నిర్వహించారు. దాడుల్లో అచ్చం ఒరిజనల్ ఎస్బీఐ బ్యాంక్ లాగా డూప్లికేట్ ఎస్బీఐ బ్యాంక్ ఉండడంతో కంగుతిన్న జోనల్ మేనేజర్..ఈ డూప్లికేట్ బ్యాంక్ వెనక ఎవరి హస్తం ఉందని ఆరా తీయగా..మాస్టర్ మైండ్ కమల్ బాబుదేనని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
