పెళ్లి కాకుండా లవర్తో ఉంటానన్న పెద్ద కూతురు : వద్దన్న నాన్న, అమ్మ, చెల్లిని చంపేసింది !

పెళ్లి కాకుండా లవర్తో ఉంటానన్న పెద్ద కూతురు : వద్దన్న నాన్న, అమ్మ, చెల్లిని చంపేసింది !

బెంగళూరులో దారుణం జరిగింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ వద్దన్నారని తల్లిదండ్రులతో పాటు చెల్లిని పొడిచి చంపేసింది ఆ ఇంటి పెద్ద కూతురు. లవర్ తో కలిసి ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కనిపెంచిన తల్లిదండ్రులు, తన నీడన పెరిగే చెల్లి అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా అంతం చేసిన ఘటన జూన్ 23న జరిగింది. 

చనిపోయిన వారిని సోమసుందర్ (55), ముతులక్ష్మీ (48 ) అనే దంపతులు, వారి కూతురు సుప్రియ (20) ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురిని కత్తితో పొడిచి చంపేసినట్లు నిర్ధారించారు. పెద్ద కూతురు శ్వేత, ఆమె లవర్ కెన్నెత్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రాథమిక విచారణ ప్రకారం, శ్వేత తల్లిదండ్రులు కెన్నెత్‌తో ఆమె సంబంధాన్ని వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతే హత్యలకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి, ధమానిక్ లేఅవుట్‌లోని సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో  ఈ హత్యలు జరిగాయి.

ఈ హత్యలు ప్రీ ప్లాన్డ్ గా జరిగాయా లేక  శ్వేత, కెన్నెత్‌లు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఈస్ట్ పాయింట్ ఆసుపత్రికి పంపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 

భారీగా అప్పులు చేసిన శ్వేత..

పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు శ్వేత దాదాపు  30 లక్షల రూపాయల వరకు అప్పులు చేసినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అప్పుల గురించి ఆమె తల్లిదండ్రులు  ప్రశ్నించడంతో కుటుంబంలో గొడవలు మొదలైనట్లు పోలీసులు చెప్పారు. 

సోమవారం (జూన్ 22) శ్వేత, కెన్నెత్‌లు ఇంటికి వెళ్లినప్పుడు ఆమె తల్లి ముత్తులక్ష్మి మాత్రమే ఇంట్లో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె తండ్రి సోమసుందర్, చెల్లెలు సుప్రియ ఆ సమయంలో ఇంట్లో లేరు. శ్వేత, కెన్నెత్, ముత్తులక్ష్మిల మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘర్షణలో ముత్తులక్ష్మిపై కత్తి లాంటి ఆయుధంతో దాడి చేసి చంపినట్లు భావిస్తున్నారు. 

హత్య జరిగిన తర్వాత, సోమసుందర్, సుప్రియ ఇంటికి రాకముందే నిందితులు బాత్రూంలో రక్తపు మరకలను కడిగారని చెబుతున్నారు. సుప్రియ ఇంట్లోకి ఎంటరవగానే శ్వేత పట్టుకోగా.. కెన్నెత్  దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత సోమసుందర్‌పై అదే ఆయుధంతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలైనప్పటికీ,  రక్తం కారుతుండగానే తండ్రి సోమసుందర్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తి సహాయం అరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. 

పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీని వెనుక ఉన్న అసలు కారణం, సంఘటనల క్రమాన్నిపరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.