కుర్చీలో కూర్చొని ఉండగా.. గుండెపోటుతో జిమ్‌ ట్రైనర్‌ మృతి

కుర్చీలో కూర్చొని ఉండగా.. గుండెపోటుతో జిమ్‌ ట్రైనర్‌ మృతి

ఉత్తరప్రదేశ్ : చావు ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. ఏ సమయంలో చనిపోతామో కూడా తెలియదు. ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా మంది ఈ మధ్య గుండెపోటుతో చనిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా యూపీలో ఓ జిమ్ ట్రైనర్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
 
33 ఏళ్ల ఆదిల్ అనే వ్యక్తి జిమ్ ట్రైనర్. ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో కొంతకాలం నుంచి జిమ్‌ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజూ జిమ్ చేస్తుంటాడు. ఆరోగ్యంలో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే.. ఈనెల 16వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ఆదిల్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. తన కార్యాలయంలో కూర్చొని ఉండగా గుండెపోటు రావడంతో అక్కడే ఉన్న కొందరు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆదిల్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. 

ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఇలా గుండెపోటుతో గురయ్యాడంటే నమ్మలేకపోతున్నామని ఆదిల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చినా కూడా జిమ్ కు వెళ్లకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకునేవాడు కాదని, ప్రతిరోజూ జిమ్ కు వెళ్లేవాడని చెప్పారు. ఆదిల్ గుండెపోటుకు గురైన విజువల్స్ జిమ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. మృతుడు ఆదిల్‌కు నలుగురు పిల్లలు. ఈ సంఘటనతో ఆదిల్ కుటుంబ సభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఈ మధ్యే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. దీంతో షాలిమార్‌ గార్డెన్‌లోనే కొత్తగా తన ఆఫీసును ప్రారంభించాడు. తన కార్యాలయంలో కూర్చొని ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు.