‘సూపర్-స్ప్రెడర్’గా మారిన కొత్త వైరస్

‘సూపర్-స్ప్రెడర్’గా మారిన కొత్త వైరస్
భారత్‌తో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. అయితే యూకే వెలుగులోకి వచ్చిన కొత్తరకం వైరస్ మాత్రం 70 శాతం ట్రాన్స్‌మిసిబిలిటీ రేటుతో ‘సూపర్-స్ప్రెడర్’గా మారిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే. పాల్ అన్నారు. అయితే ఈ ‘సూపర్-స్ప్రెడర్’ఇప్పటివరకు ఇండియాలో కనుగొనబడలేదని ఆయన అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో మంగళవారం కరోనా కేసుల సంఖ్య 3 లక్షల (2,92,518) కంటే తక్కువగా నమోదైంది. ఈ సంఖ్య గడిచిన 163 రోజులలో అత్యల్పం కావడం గమనార్హం. కోవిడ్-19 గురించి విలేకరుల సమావేశంలో డాక్టర్ వీకే. పాల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మేం కరోనాను నియంత్రించడంలో విజయాన్ని సాధించాం. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించాలి. మనం అప్రమత్తంగా ఉండడం ద్వారానే వైరస్‌ను కంట్రోల్ చేయగలుగుతాం. తాజాగా యూకేలో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. మేం యూకే పరిశోధనా సంఘంతో మాట్లాడాం. ఈ కొత్త వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిసింది. ఈ వైరస్ మ్యుటేషన్ వ్యాధి యొక్క తీవ్రతను ప్రభావితం చేయదు. వైరస్‌లో 17 రకాల మార్పులున్నాయి. వాటిలో N501Y అనేది మానవులకు సంక్రమించే వైరస్. ఇది ఎక్కువ మందికి సోకే ప్రమాదముంది. ఇది ఆందోళనకు ఒక కారణం. కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ గురించి పరిశీలిస్తోంది. ల్యాబ్‌లలో వేలాది వైరస్‌ల జన్యు నిర్మాణం గురించి అధ్యయనం చేస్తున్నాం. వైరస్ యొక్క మ్యుటేషన్ ప్రస్తుతానికి కనుగొనలేదు. ఈ కొత్త వైరస్ ఆస్ట్రేలియా మరియు ఐరోపాలోని కొన్ని దేశాలలో కనుగొనబడింది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. యూకేలో వైరస్ మ్యుటేషన్ పెరుగుతున్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. యూకే నుంచి వచ్చి వెళ్లే విమానాలను డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణీకులను గుర్తించి.. వారి ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేస్తున్నాం. వారందరికీ కోవిడ్ పరీక్షలు చేస్తున్నాం. వారికి వైరస్ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌లో ఉంచుతాం. యూకే నుంచి వచ్చే ప్రయాణికులందరూ ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఈ మ్యుటేషన్ కారణంగా ప్రస్తుతం చేస్తున కరోనా చికిత్స విధానంలో మరియు కరోనా మార్గదర్శకాలలో ఎటువంటి మార్పు లేదు’ అని డాక్టర్ పాల్ అన్నారు. For More News.. లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ మర్డర్ ప్లాన్.. నిలిచిన రెండు ప్రాణాలు తెలుగును అధికార భాషగా ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం