పార్టీల జమాఖర్చుల లెక్కల కోసం కొత్త పోర్టల్

పార్టీల జమాఖర్చుల లెక్కల కోసం కొత్త పోర్టల్
  • ప్రత్యేకంగా ప్రారంభించిన ఎలక్షన్ కమిషన్

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు తమ ఆదాయం, పెట్టిన ఖర్చులకు సంబంధించి ప్రతీ పైసా లెక్క చెప్పాల్సిందేనని ఎలక్షన్ కమిషన్ గతంలోనే వెల్లడించింది. తాజాగా ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను ప్రారంభించింది. రాజకీయ పార్టీలు తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన స్టేట్ మెంట్లను ఈ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని పేర్కొంది. చందాల రూపంలో వచ్చే ఆదాయాలకు సంబంధించిన నివేదికలు, ఆడిట్ చేసిన వార్షిక స్టేట్ మెంట్లు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన స్టేట్ మెంట్లను ఈ పోర్టల్ లో విధిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఫిజికల్ ఫార్మాట్​ లో నివేదికలను సమర్పించడంలో ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ పోర్టల  ఉపయోగపడుతుందని పేర్కొంది. 

అంతేకాదు, ఏటా సమయానుకూలంగా నివేదికలను సమర్పించడం పార్టీలకు సులభం అవుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పోర్టల్ తో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. పోర్టల్ లో నమోదు చేసుకున్న రాజకీయ పార్టీల ప్రతినిధుల మొబైల్స్ కు, పార్టీ ఈమెయిల్ అడ్రస్ లకు స్టేట్ మెంట్లను అప్ లోడ్ చేయాలంటూ సందేశాలు కూడా వెళతాయని వెల్లడించింది.