తెరపైకి రెండో రాజధాని!

తెరపైకి రెండో రాజధాని!

హైదరాబాద్, వెలుగుదేశ రాజధాని ఢిల్లీని పొల్యూషన్​వెంటాడుతున్న దృష్ట్యా మరోసారి రెండో రాజధాని అంశం తెరమీదికి వచ్చింది. కాలుష్యం వల్ల అక్కడ ఉండలేకపోతున్నామని, పరిపాలనను విస్తరిస్తే ఢిల్లీలో జనసాంద్రత తగ్గి సమస్యకు కొద్దోగొప్పో పరిష్కారం దొరుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పుడున్న రాజధాని ఉత్తరాది వారికి మాత్రమే అనువుగా ఉందని, దక్షిణాదికి చాలా దూరంగా ఉందని నిపుణులు అంటున్నారు. ఉత్తరాదికి, దక్షిణాదికి కనెక్టివిటీ పెరగాలంటే.. ఢిల్లీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక నగరంలో సెకండ్​ క్యాపిటల్​ ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ వినిపిస్తోంది. ఇందులో హైదరాబాద్​తోపాటు చెన్నై, బెంగళూరు, అమరావతి వంటి నగరాలపై ప్రధానంగా చర్చ నడుస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఎయిర్​ పొల్యూషన్​ మరింత పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దేశ రాజధాని కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి జనం ఢిల్లీకి వచ్చి నివసిస్తున్నారు. దేశ పరిపాలన వ్యవస్థతోపాటు సుప్రీంకోర్టు,   ఇతర ప్రధాన ప్రభుత్వ ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయి. ఫలితంగా రాజకీయ నాయకులు, అధికారులు ఢిల్లీలో ఉండటమో.. వచ్చిపోవడమో చేస్తుంటారు. ప్రస్తుతం పొల్యూషన్​ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. తామూ ఉండలేకపోతున్నామని ఢిల్లీ వాసులు అంటున్నారు. ప్రతి చలికాలంలో ఢిల్లీని ఎయిర్​ పొల్యూషన్​ తీవ్రంగా వేధిస్తోంది. సమ్మర్​లో విపరీతమైన ఉష్ణోగ్రతలు కూడా సమస్యగానే మారాయి. పొల్యూషన్​ కంట్రోల్​చేయాలన్నా.. పరిపాలను విస్తరించాలన్నా దేశానికి సెకండ్​ క్యాపిటల్ అవసరమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్​ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇదే అంశాన్ని కాంగ్రెస్​ నేత అభిషేక్​ సింఘ్వి ప్రస్తావించారు. జార్ఖండ్​లోని రాంచీ లేదా ఏపీలోని అమరావతిని దేశానికి సెకండ్​ క్యాపిటల్​గా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరైతే  ఢిల్లీలో పొల్యూషన్​ సమస్య పోవాలంటే పూర్తిగా దేశరాజధానిని అక్కడి నుంచి షిఫ్టు చేయాలని అంటున్నారు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీలో జనసాంద్రత పెరిగిపోతోందని, ఫలితంగా పొల్యూషన్​ను కంట్రోల్​ చేయడం పెను సమస్యగా మారిందని చెబుతున్నారు. ఇండోనేషియా వంటి దేశాలు కూడా రాజధానులను షిఫ్టు చేస్తున్నాయని అంటున్నారు.

ప్రపోజల్స్​లోని నగరాలు

సెకండ్​ క్యాపిటల్​గా దక్షిణాదిలోని హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, వైజాగ్​, అమరావతి నగరాలను పరిశీలించాలన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది.  అదేవిధంగా మధ్యప్రదేశ్​లోని భోపాల్, మహారాష్ట్రలోని నాగ్​పూర్​, ముంబై, చత్తీస్​గఢ్​లోని రాయ్​పూర్​ వంటి నగరాల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే.. చెన్నై, వైజాగ్​, అమరావతి నగరాలు కోస్టల్​ ఏరియాకు దగ్గరగా ఉండటంతో తుఫాన్లు, భూకంపాల బెడద ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా చెన్నైతోపాటు బెంగళూరు నగరాలు ఓ మూలకు ఉంటాయని, ఇతర రాష్ట్రాలతో వాటికి అంత కనెక్టివిటీ ఉండదని, అవి కంజెస్టెడ్​ ఏరియాలని అంటున్నారు. భోపాల్​ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అది ఉత్తరాదికే దగ్గరగా ఉంటుందని, అక్కడ  సెకండ్​ క్యాపిటల్​సిటీ ఏర్పాటు చేస్తే దక్షిణాదికి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ముంబై విషయానికి వస్తే అది కూడా చాలా కంజెస్టెడ్​గా ఉంటుందని, ఇప్పటికే అది ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ సెకండ్​ క్యాపిటల్​కు అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. రాయ్​పూర్​ నక్సల్స్​ ప్రభావిత ప్రాంతమని, అక్కడ సెకండ్​ క్యాపిటల్​ చాన్స్​ లేదని చెబుతున్నారు. నాగ్​పూర్​ విషయానికి వస్తే.. అక్కడ వేసవి కాలంలో విపరీతంగా వేడి ఉంటుందని, ఏటా 50 నుంచి 60 రోజులు వడగాడ్పులు వీస్తాయని అంటున్నారు. హైదరాబాద్​కు తుఫాన్లు, భూకంపాల ముప్పు లేదని, ఉత్తరాదితో కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుందని, పైగా విస్తారమైన భూములు కూడా ఉన్న ప్రాంతమన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రపతికి ఢిల్లీలోనే కాకుండా అటు సిమ్లాలో, ఇటు హైదరాబాద్​లో రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి. ఏటా చలికాలంలో  రాష్ట్రపతి హైదరాబాద్​లో ఉంటారు. ఇవన్నింటి దృష్ట్యా  సెకండ్​ క్యాపిటల్​ సిటీ ప్రపోజల్స్​లో హైదరాబాద్​పై  ప్రధానంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇదే అంశం తెరమీదికి వచ్చింది.