మోదీ కుర్చీ కదులుతోంది.. అందుకే దోస్తులనూ తిడుతున్నడు: ఖర్గే

మోదీ కుర్చీ కదులుతోంది.. అందుకే దోస్తులనూ తిడుతున్నడు: ఖర్గే

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కుర్చీ కదులుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకే మోదీ తన సొంత దోస్తులనూ తిడుతున్నారని పేర్కొన్నారు. గత ఐదేండ్లుగా అంబానీ, అదానీని తిట్టిన కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే సైలెంట్ అయిపోయారని, ఇందుకోసం వాళ్ల దగ్గరి నుంచి ఎంత తీసుకున్నారో చెప్పాలని మోదీ చేసిన కామెంట్లకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ‘‘కాలం మారుతున్నది. దోస్తులు ఇకపై దోస్తులు కాదు. మూడు విడతల ఎలక్షన్స్ ముగిసిన తరుణంలో ప్రధాని మోదీ తన సొంత దోస్తులపైనే కామెంట్లు చేస్తున్నరు. అంటే మోదీ కుర్చీ కదులుతున్నదని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే రిజల్ట్ రియల్ ట్రెండ్” అని సోషల్ మీడియా ఎక్స్ లో ఖర్గే బుధవారం పోస్టు పెట్టారు. 

మోదీకి ఓటమి ఖాయమైంది: జైరాం రమేశ్ 

మోదీ కామెంట్లకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ‘‘మోదీకి ఓటమి ఖాయమైంది. ఆయన ఇప్పుడు తన సొంత నీడను కూడా నమ్మడం లేదు. ‘హమ్ దో.. హమారే దో’ అంటూ ఇన్ని రోజులు పాట పాడిన మోదీ.. ఇప్పుడు తన సొంత పిల్లలనే తిడుతున్నారు” అని సోషల్ మీడియా ఎక్స్ లో జైరాం రమేశ్ పోస్టు పెట్టారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ కోసం రూ.8,200 కోట్లు కలెక్ట్ చేసిన మోదీ.. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. మోదీ ఈ విరాళాల కోసం వ్యాపారవేత్తలకు రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులు, లైసెన్సులు ఇచ్చారు. 

దేశంలోని 70 కోట్ల మంది దగ్గరున్న సంపద కంటే.. మోదీకి సన్నిహితులైన 21 మంది బిలియనీర్ల దగ్గరున్న సంపదే ఎక్కువ. వీరిలో ఆ ఇద్దరూ (అంబానీ, అదానీ) కీలకం” అని పేర్కొన్నారు. ‘‘మోదానీ (మోదీ, అదానీ) స్కామ్ పై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని 2023 జనవరి 28 నుంచి డిమాండ్ చేస్తున్నం. మేం ఈ డిమాండ్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నం. ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా అంబానీ, అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఏప్రిల్ 3 నుంచి తన స్పీచ్ లలో అదానీ పేరును 103 సార్లు, అంబానీ పేరును 30సార్లకు పైగా ప్రస్తావించారు” అని చెప్పారు.