బీజేడీని విచ్ఛిన్నం చేసే యోచనలో బీజేపీ: బీజేడీ నేత పాండియన్ ఫైర్

బీజేడీని విచ్ఛిన్నం చేసే యోచనలో బీజేపీ: బీజేడీ  నేత పాండియన్ ఫైర్

భువనేశ్వర్: బిజూ జనతాదళ్‌‌(బీజేడీ) నాయకుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒడిశాలో ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించడంలేదని.. ఎన్నికల తర్వాత బిజూ జనతాదళ్‌‌ను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో తన సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి పోరాడుతోందని ఆయన విమర్శించారు. ‘‘2014లో 120 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని విఫలమయ్యారు. 2019లో వారి టార్గెట్‌‌నాకు తెలియదు. కానీ, 2024లో మాత్రం 50 లేదా 60 సీట్లు గెలుచుకుని బీజేడీని విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో వారు ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఇదీ వారి ఎన్నికల వ్యూహం' అని పాండియన్ అన్నారు. 

బుధవారం గంజాం జిల్లాలోని గోపాల్‌‌పూర్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌‌ లో మాదిరిగా ఇక్కడ కూడా అలాగే చేయాలన్నది వారి అంతర్గత వ్యూహం. కానీ, బీజేపీ పథకం ఇక్కడ ఫలించదు. జాతీయ స్థాయి నుంచి అనేక మంది రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్నారు. అయితే ఒడిశా ప్రజలకు మాత్రం వారిపై నమ్మకం లేదు. నవీన్ బాబు అంటేనే ప్రజలకు విశ్వాసం’’ అని పాండియన్​స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్​ కచ్చితంగా గెలుస్తారని గట్టి నమ్మకం ఉందని, ఆ జగన్నాథుని ఆశీస్సులతో జూన్ 9న పట్నాయక్​ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.