హిసార్​లో ఫ్యామిలీ ఫైట్​.. ఒకే సీటుకు ఇద్దరు కోడళ్లు, చిన్న మామ పోటీ!

హిసార్​లో ఫ్యామిలీ ఫైట్​.. ఒకే సీటుకు ఇద్దరు కోడళ్లు, చిన్న మామ పోటీ!

హిసార్ (హర్యానా):  హర్యానాలోని హిసార్ లోక్ సభ స్థానంలో చౌతాలా ఫ్యామిలీకి చెందిన అభ్యర్థుల మధ్యే త్రిముఖ పోరు నెలకొంది. చౌతాలా ఫ్యామిలీలోని ఇద్దరు కోడళ్లు, చిన్న మామ ఒకరిపై ఒకరు పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. హిసార్ లోక్ సభ బరిలో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి ఎమ్మెల్యే నైనా చౌతాలా, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నుంచి సునయన చౌతాలా, బీజేపీ నుంచి రంజిత్ సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు.

వీరిలో నైనా చౌతాలా(57).. ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా పెద్ద కొడుకు, జేజేపీ చీఫ్ అజయ్ సింగ్ చౌతాలా భార్య. మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాలాకు స్వయానా తల్లి కూడా. ఇక సునయన చౌతాలా(47).. ఓం ప్రకాశ్ చౌతాలా తమ్ముడు ప్రతాప్ సింగ్ చౌతాలా కొడుకు రవి చౌతాలా భార్య. అలాగే రంజిత్ సింగ్ చౌతాలా(78) స్వయానా మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ కు కొడుకు, ఓం ప్రకాశ్ చౌతాలాకు తమ్ముడు. దీంతో చౌతాలా కుటుంబంలోని ఇద్దరు కోడళ్లు, చిన్న మామయ్య ఒకరిపై ఒకరు పోటీకి దిగినట్లయింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. 

ముగ్గురూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరు కోడళ్లు కాస్త విమర్శల వేడిని పెంచుతున్నా.. చిన్న మామ మాత్రం కోడళ్లపై సాఫ్ట్ కార్నర్​తోనే పెద్దగా విమర్శల జోలికి పోకుండా ప్రచారం చేసుకుంటున్నారు. అగ్రి చట్టాల రద్దు కోసం ఆందోళన చేసిన రైతులు తమకే అండగా నిలబడతారని, గతంలో కూటమిగా ఉన్న జేజేపీ, బీజేపీలను ఓడిస్తారని సునయన ధీమాగా ఉన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని రంజిత్ సింగ్ చెప్తున్నారు. రైతుల శ్రేయస్సు కోరే తననే గెలిపించుకుంటారని నైనా ధీమాగా చెప్పుకొంటున్నారు.  

గతంలో అన్నదమ్ములు కూడా..

ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన తమ్ముడు రంజిత్ చౌతాలా కూడా గతంలో రోరి అసెంబ్లీ సీటులో ఒకరిపై ఒకరు పోటీ చేశారు. దబ్వాలీ నుంచి అజయ్ చౌతాలా, రవి చౌతాలా కూడా ఒకరిపై ఒకరు బరిలోకి దిగారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 10 ఎంపీ సీట్లకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది.