టార్గెట్ గోల్డ్.. హడలెత్తిస్తున్న దొంగలు

టార్గెట్ గోల్డ్.. హడలెత్తిస్తున్న దొంగలు
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస చోరీలు, చైన్ స్నాచింగులతో కలకలం
  • ఒకేరోజు మూడుచోట్ల చైన్ స్నాచింగ్, 9 ఇండ్లలో దొంగతనం
  • ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ చొరబడినట్లు అనుమానాలు 
  • సీసీ కెమెరాలున్నా ట్రేసింగ్ లో ఇబ్బందులు
  • కేసుల ఛేదనలో వెనుకబడుతున్న పోలీసులు

హనుమకొండ/ జయశంకర్​భూపాలపల్లి/ మంగపేట, వెలుగు: మార్కెట్ లో గోల్డ్ ధర ఆకాశాన్నంటుంతోంది. తులం రేట్ రూ.లక్షన్నరకుపైగా పలుకుతుండటంతో చోరీలు కూడా పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 12 చోట్ల దొంగతనాలు జరిగాయి. అందులో వరంగల్ ట్రై సిటీలో మూడు చైన్ స్నాచింగులు, భూపాలపల్లిలో ఇండ్లలో చోరీ, ములుగు జిల్లా కమలాపూర్ లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటీవల వరంగల్ ట్రై సిటీతో పాటు ఉమ్మడి జిల్లాలోని రూరల్ ఏరియాల్లో చైన్ స్నాచింగులు, చోరీలు పెరుగుతున్నప్పటికీ కేసుల ఛేదనలో మాత్రం పోలీసులు వెనకబడుతున్నారు. కాగా, వరుస చోరీల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఎంటరైనట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అంతర్రాష్ట్ర ముఠాలతో కలవరం..

వరంగల్ నగరానికి రోడ్డు, రైలు మార్గాలతో మెరుగైన కనెక్టివిటీ ఉంది. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు వరంగల్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వరంగల్ నగరానికి రావడం, ఇక్కడ బైక్ లు చోరీ చేసి వాటి ద్వారా మిగతా చోట్లా చోరీలకు తెగబడటం కామనైపోయింది. ముఖ్యంగా రైలు కనెక్టివిటీ ఉన్న వరంగల్ కమిషనరేట్ లోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఆ తీవ్రత చోరీల ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన దొంగలు వరంగల్ ట్రై సిటీలోకి ఎంటరై చైన్ స్నాచింగ్ లకు పాల్పడటంతో గత నెల పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా చైన్ స్నాచింగులు, దొంగతనాలు పాల్పడింది కూడా అంతర్రాష్ట్ర ముఠాలే కావచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

చైన్ స్నాచింగ్స్.. ఇండ్లల్లో చోరీలు..

వరంగల్ ట్రై సిటీలో పరిధిలో సోమవారం ఒక్కరోజే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో రెడ్ కలర్ పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు.. క్రిస్టియన్ కాలనీలో ఆరుబయట ఉన్న మైదం వివేక్ అనే వ్యక్తి మెడలోంచి చైన్ లాక్కుని పరారయ్యారు. అక్కడి నుంచి కాశీబుగ్గ సొసైటీ కాలనీకి వెళ్లిన ఇదే గ్యాంగ్ యువకులు దీపశ్రీ అనే మహిళ తన పిల్లలకు అన్నం తినిపిస్తున్న క్రమంలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు.

మరో వైపు హనుమకొండ పీఎస్ పరిధి జాగృతి కాలనీలో కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంటి ఎదుట ఉండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 3 తులాల పుస్తెల తాడు లాక్కొని పరారయ్యారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సింగరేణి 1000 క్వార్టర్స్ లోని ఏడు ఇండ్లలో చోరీలు జరిగాయి. స్రవంతి అనే మహిళా ఇంట్లోని బీరువాలో 17.4 తులాల బంగారం, రూ.15 వేలు, గాజుల వెంకటేశ్వర్లు ఇంట్లో 5 గ్రాముల బంగారం, 4 గ్రాముల వెండి, రూ.6 వేలు, పోతరవెన రాజేశ్ ఇంట్లో 6 తులాల వెండి, 2 గ్రాముల బంగారం, వేముల బాబురావు ఇంట్లో 10 తులాల వెండి, రూ.1000 నగదు ఎత్తుకెళ్లారు.

మిగిలిన రెండు ఇండ్లలో దొంగలు చోరబడినా ఎలాంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని సీపీనగర్ లోని మేడిద రఘుపతి ఇండ్లో చోరీ చేసిన దుండగులు సుమారు 3 తులాల బంగారం, 15 తులాల వెండి, సుమారు రూ.లక్షకు పైగా అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఆయా చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

చోరీలు ఎక్కువ.. రికవరీ తక్కువ

ప్రస్తుత మార్కెట్ లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంది. దీంతోనే గోల్డ్ ను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. చైన్ స్నాచింగులు, చోరీలకు పాల్పడుతున్న దుండగులు సీసీ కెమెరాల్లో రికార్డవుతున్నా కంటిన్యూటీ లేకపోవడం వల్ల నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు లేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. దీంతో చోరీలు, చైన్ స్నాచింగులను ట్రేస్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దాదాపు రెండేండ్ల కింద వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ లో దాదాపు రూ.13.61 కోట్ల విలువైన 19 కిలోల బంగారం చోరీకి గురవగా, ఆ తర్వాత అదే బాటలో గోల్డ్ బేస్డ్ దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నిరుడు ఇండ్లలో చోరీలు, చైన్ స్నాచింగులు అన్నీ కలిపి  434 దొంగతనాలు జరగగా, రూ.10.10 కోట్ల వరకు ప్రాపర్టీ లాస్ జరిగింది. అందులో పోలీసులు రికవరీ చేసింది రూ.4.55 కోట్లు మాత్రమే. గడిచిన నాలుగు నెలల్లోనే 240కిపైగా దొంగతనాల్లో రూ.1.92 కోట్ల వరకు లాస్ జరగగా, అందులో రికవరీ 50 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఇకనైనా చోరీలు, చైన్ స్నాచింగుల కట్టడికి పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.