విలీన ప్రాంతాల్లో సీవరేజీ పనులు చేయట్లే.. ఎవరు చేయాలనేదానిపై నో క్లారిటీ

విలీన ప్రాంతాల్లో సీవరేజీ పనులు చేయట్లే.. ఎవరు చేయాలనేదానిపై నో క్లారిటీ
  • మూడు కార్పొరేషన్లు పట్టించుకోవట్లే
  • సంబంధం లేదంటున్న జలమండలి
  • పాత జీహెచ్ఎంసీ పరిధే అంటున్న వాటర్​ బోర్డు  
  • ఎవరూ పట్టించుకోక ఎక్కడికక్కడే సమస్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లలో విలీనమైన ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో సీవరేజీ ఎమర్జెన్సీ నెలకొంది. విలీనానికి ముందు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు డ్రైనేజీ  నిర్వహణ బాధ్యతలు స్వయంగా చేపట్టేవి. విలీనం తర్వాత ఈ ప్రాంతాల్లో సీవరేజీ పనులు ఎవరు చేయాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

జలమండలి కూడా పాత జీహెచ్ఎంసీ వరకు మాత్రమే తమకు సంబంధమని, విలీనమైన ప్రాంతాల్లో నిర్వహణ చేయబోమని తేల్చిచెప్పింది. దీంతో డ్రైనేజీలు మూసుకుపోవడం, మురుగు రోడ్లపైకి పొంగిపొర్లడంతో పాటు దుర్వాసన వస్తోంది. వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. మురుగు రోడ్లపై పారుతుండడంతో వ్యాధులు వస్తాయని, ఎవరికి వారు సొంతగా పనులు చేయించుకుంటున్నారు. మ్యాన్ హోల్ మూతలు పగిలినా ఏర్పాటు  చేయడం లేదు. 

ప్రభుత్వ జోక్యం తప్పనిసరి..
సమస్య వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ అధికారులను ఆశ్రయిస్తే జలమండలిని సంప్రదించాలని అంటున్నారని, వాటర్​బోర్డు అధికారులను అడిగితే తమ పరిధిలోకి రాదని చెబుతున్నారని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సీవరేజీ నిర్వహణ బాధ్యతలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.