డబ్బుల్లేక డాక్టర్ చదువుకు దూరమైన యువతి

డబ్బుల్లేక డాక్టర్ చదువుకు దూరమైన యువతి

కుభీర్, వెలుగు : మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న ఆ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో బిడ్డకు ఎంబీబీసీ సీటు వచ్చినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ లేక డాక్టర్​ చదువుకు దూరమవుతోంది. దీంతో దాతల కోసం ఎదురు చూస్తోంది. నిర్మల్ ​జిల్లా కుభీర్​ మండలం సిర్పెల్లి (హెచ్​)లో గాడేకర్ అమ్రాజీ, -జయశీల దంపతుల కూతురు సంకీర్తన నీట్​లో ర్యాంకు సాధించి హైదరాబాద్​ మల్లారెడ్డి మెడికల్​కాలేజీలో ఎంబీబీఎస్​ సీటు సాధించింది.  అక్కడ ఏడాదికి రూ. 2.50 లక్షలు కట్టాలని చెప్పడంతో చదువుకు దూరమవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.  

గుంట భూమి లేదు..రేకుల షెడ్డులోనే నివాసం  

గాడేకర్ అమ్రాజీది నిరుపేద కుటుంబం. గుంట భూమి కూడా లేదు. రేకుల షెడ్డులో ఉంటున్నారు. సంకీర్తన తల్లి జయశీల దివ్యాంగురాలు. తండ్రి అమ్రాజీ కూలీ. దీర్ఘకాలిక వ్యాధి ఉన్నా బిడ్డను చదివించాడు.   

ఊళ్లో ఫస్ట్ సీటు ఈమెదే.. 

సంకీర్తన ఆదిలాబాద్​ గురుకులంలో ఇంటర్​ చదివింది. నీట్​లో ఆల్​ ఇండియాలో 1,92,617 ర్యాంకు, మెరిట్​లో 388, కేటగిరిలో 14,196 ర్యాంకు సాధించింది. సిర్పెల్లి చరిత్రలో ఎంబీబీఎస్​ సీటు సాధించిన మొదటి బిడ్డ సంకీర్తనే కావడం గమనార్హం. ఫ్రీ సీటు రావడంతో మల్లారెడ్డి కాలేజీలో చేరేందుకు వెళ్లగా అడ్మిషన్​ కోసం రూ. లక్ష కావాలని అడిగారు. దీంతో తెలిసిన వారి దగ్గర వడ్డీకి తేవాల్సి వచ్చింది. అయితే ఏడాదికి రూ.2.50 లక్షల చొప్పున ఐదేండ్లకు 13.50 లక్షలు కట్టాల్సి రావడంతో మిగతా డబ్బుల కోసం దాతల సాయం కోరుతున్నారు.