Rahul Dravid: ద్రవిడ్ సింప్లిసిటీ.. క్యూలో నిలబడి ఓటేసిన దిగ్గజ క్రికెటర్

Rahul Dravid: ద్రవిడ్ సింప్లిసిటీ.. క్యూలో నిలబడి ఓటేసిన దిగ్గజ క్రికెటర్

టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఎంత సింపుల్​గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దిగ్గజ క్రికెటరైనా.. గొప్ప హోదాలో ఉన్నా చాలా సాధారణంగా ఉంటాడు. ఇటీవలే తన పెద్ద కుమారుడు సమిత్ (18) అండర్ - 19 కూచ్ బిహార్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు.. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో కాకుండా.. సాధారణ వ్యక్తిలాగా తన భార్యతో కలిసి స్టేడియంలో మెట్లపై కూర్చొని తమ కుమారుడి ఆటను చూశాడు. తాజాగా..మరోసారి తన సింప్లిసిటీతో నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నాడు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌స‌భ‌ రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా క‌ర్ణాట‌క‌లో ఓటింగ్ జ‌రుగుతోంది. భార‌త మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌ రాజ‌ధాని బెంగ‌ళూరులో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అంద‌రీతో క‌లిసి క్యూలో నిల‌బ‌డి ద్ర‌విడ్ ఓటు వేయడం విశేషం. ద్రవిడ్ తో పాటు భారత దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ద్ర‌విడ్ మీడియాతో  మాట్లాడుతూ ప్ర‌తిఒక్క‌రూ ఓటు వేయాలని ..  ప్రజాస్వామ్యంలో ఇది మనకు లభించే గొప్ప‌ అవకాశం అని అన్నారు. 

కర్ణాటకలో లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో శుక్రవారం 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 543 స్థానాలు ఉన్న‌ పార్లమెంట్‌లో 28 స్థానాలు కర్ణాటకలో ఉన్నాయి. ఈ 28 స్థానాల‌కు రెండు దశల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నేడు మొద‌టి ద‌శ‌లో ఉడిపి చికమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్ 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.