- కారులో కూర్చున్న లక్కీ ఒబెరాయ్ పై ఫైరింగ్
- బుల్లెట్ గాయాలతో స్పాట్ లోనే లక్కీ మృతి
జలంధర్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత లక్కీ ఒబెరాయ్ (38) మృతిచెందాడు. శుక్రవారం ఉదయం 7.55 గంటల ప్రాంతంలో జలంధర్ సిటీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురుద్వారా వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. ఒబెరాయ్.. గురుద్వారా నుంచి బయటకు వచ్చి తన థార్ వెహికల్లో కూర్చుని ఉండగా.. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒబెరాయ్‌ని దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అతడు అప్పటికే మృతి చెందారు.
ఒబెరాయ్ భార్య సిమర్‌జోత్ కౌర్.. గత సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఒబెరాయ్.. ఫైనాన్షియర్‌గా, రియల్ ఎస్టేట్వ్యాపారిగా పనిచేశాడు. అతని కుటుంబం జలంధర్ సిటీలోని గురు తేగ్ బహదూర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నది. కాగా, ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. దగ్గర్లోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు.
బ్లాక్కలర్ హూడీ, ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తి ఒబెరాయ్ వాహనం వైపు నడుస్తూ.. దగ్గరి నుంచి కాల్పులు జరిపి పారిపోయిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. కాగా. ఒబెరాయ్ హత్యపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకే రక్షణ లేకుంటే, సామాన్యుల పరిస్థితేంటని ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఎక్స్‌లో ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆప్ పాలనలో ఎవరూ సురక్షితంగా లేరని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ అన్నారు. పంజాబ్‌ను ఆప్ ప్రభుత్వం జంగిల్ రాజ్‌లోకి నెట్టిందని ఆయన విమర్శించారు.
