బయటపడ్డ డైనోసార్ గుడ్లు.. ఒకటి స్పెషల్!

బయటపడ్డ డైనోసార్ గుడ్లు..  ఒకటి స్పెషల్!

మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలోని  ‘డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్’లో  10 డైనోసార్ గుడ్ల శిలాజాలు బయటపడ్డాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల బృందం నిర్వహించిన అధ్యయనంలో పార్కులో మొత్తం 52 డైనోసార్ల గూళ్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా గుడ్ల శిలాజాలను గుర్తించారు. పది గుడ్లలో ఒకటి వెరీ స్పెషల్ అని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ గుంటుపల్లి వి.ఆర్.ప్రసాద్  తెలిపారు. సాధారణంగా గుడ్డుపై ఒక ఎగ్ షెల్ ఉంటుంది. కానీ వృత్తాకారంలో ఉన్న  ఓ గుడ్డు లోపల అదనంగా మరో ఎగ్ షెల్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గుడ్డులో మరో గుడ్డు ఉంది.

పక్షుల  గుడ్లలో మాత్రమే..

డైనోసార్లు, మొసళ్లు, తాబేళ్లు, బల్లులు, సరీసృపాలలో ఇప్పటి వరకు ఇలా గుడ్డులో మరో గుడ్డు నిర్మాణం బయటపడలేదు.  గతంలో పక్షుల  గుడ్లలో మాత్రమే ఈ తరహా నిర్మాణాన్ని గుర్తించారు. సరీసృపాల పునరుత్పత్తి మార్గానికి భిన్నంగా ఈ గుడ్డులో అంతర్గత నిర్మాణం ఉందని  ప్రొఫెసర్  గుంటుపల్లి  వి.ఆర్.ప్రసాద్  వివరించారు.   ‘‘డైనోసార్ల పునరుత్పత్తి వ్యవస్థ..  పక్షులు, మొసళ్లు, తాబేళ్లు, బల్లుల పునరుత్పత్తి వ్యవస్థను పోలినదేనా ? అనే పరిశోధనలను ఈ డైనోసార్ గుడ్డు ఉపయోగపడుతుంది. సరీసృపాలు, పక్షుల పునరుత్పత్తి వ్యవస్థలకు ఉన్న సంబంధాల గురించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు బాటలు వేయనుంది ’’ అని ఆయన తెలిపారు. డైనోసార్ గుడ్ల శిలజాలకు సంబంధించి ప్రొఫెసర్  గుంటుపల్లి  వి.ఆర్.ప్రసాద్ రూపొందించిన నివేదిక ‘ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురితమైంది.