కరీంనగర్ జిల్లాలో రూ. పది వేలు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్...

కరీంనగర్ జిల్లాలో రూ. పది వేలు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్...

కరీంనగర్ జిల్లాలో ఏసీబీకి చిక్కాడు మరో అవినీతి అధికారి. జిల్లాలోని సైదాపూర్ మండలంలో రూ. పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామి. శుక్రవారం ( జూన్ 5 ) ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో సర్వేయర్ కుమారస్వామితో పాటు ప్రైవేట్ సహాయకులు తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిని కూడా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి భూమి సర్వే నిర్వహించేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు కుమారస్వామి.మే 23న కుమారస్వామి రూ.5 వేలు యూపీఐ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. జూన్ 2న మరో రూ.10 వేలు ప్రైవేట్ సహాయకుడు వంగా విహిత్ రెడ్డి ద్వారా తీసుకున్నాడని తెలిపారు. మిగిలిన రూ.10 వేల మరో ప్రైవేట్ సహాయకుడు తీగల రాజేష్ ద్వారా ఇవాళ  తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

విధులను నిజాయితీగా నిర్వహించాల్సిన సర్వేయర్ అక్రమ లాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలిపారు ఏసీబీ  అధికారులు. యెక్కలదేవి కుమారస్వామి, తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు అధికారులు.