సింగరేణిలో యాక్సిడెంట్ల గుబులు

సింగరేణిలో యాక్సిడెంట్ల గుబులు
  • బొగ్గు బాయికాడ..  జర పైలం బిడ్డో
  • ఈ ఏడాది ఇప్పటికి ఐదుగురు మృతి
  • పన్నెండేళ్లలో 115 మంది..

భద్రాద్రికొత్తగూడెం/మందమర్రి, వెలుగు: సింగరేణి కాలరీస్​ కంపెనీలో యాక్సిడెంట్లు గుబులు పుట్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓసీలో బుధవారం జరిగిన యాక్సిడెంట్​లో ముగ్గురు మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు సింగరేణిలో ఐదుగురు చనిపోయారు. ఏప్రిల్​నెల మొదట్లో జయశంకర్​ భూపాలపల్లి ఏరియాలో జరిగిన మైన్​యాక్సిడెంట్​లో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పన్నెండేళ్ల కాలంలో మైన్స్​ యాక్సిడెంట్లలో దాదాపు 115 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3 వేల మందికి తీవ్ర, 4,500 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కంపెనీలో జీరో యాక్సిడెంట్లు తీసుకురావటమే ప్రధాన లక్ష్యమని సింగరేణి యాజమాన్యం పేర్కొంటోంది. ఇందులో భాగంగానే ప్రతి ఏటా పెద్దఎత్తున రక్షణ వారోత్సవాలను, సేఫ్టీ బైపార్టెడ్​, ట్రైపార్టెడ్​ మీటింగ్​లను నిర్వహిస్తోంది. అయినప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు. గతేడాది 13 మంది మృతిచెందగా 195 మంది గాయాలపాలయ్యారు. 

గతేడాది జాడలేని సేఫ్టీ వీక్​ 
యాక్సిడెంట్లను తగ్గించే క్రమంలో ప్రతి ఏటా సింగరేణి​ మైన్స్​లలో యాజమాన్యం సేఫ్టీ వీక్​నిర్వహిస్తుంటుంది. గతేడాది కొవిడ్​కారణంగా నిర్వహించలేదు. సేఫ్టీ ట్రైపార్టెడ్​ మీటింగ్​లు ఏడాదికోసారి కాకుండా ఒక్కో అంశంపై సదస్సులు, సెమినార్లను ఒక్కో నెలలో నిర్వహించాలని వర్కర్స్​ కోరుతున్నారు. యాక్సిడెంట్లను తగ్గించటంలో యాజమాన్యం విఫలమవుతుందనే విమర్శలున్నాయి. సేఫ్టీ కన్నా ప్రొడక్షన్​కే యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన విధంగా పూర్తి స్థాయిలో రక్షణ పరికరాలు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. రక్షణలో కీలకమైన బూట్లు క్వాలిటీగా లేవని కార్మికులు ఆరోపిస్తున్నా యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రమాదాలు జరిగిన టైంలో కిందిస్థాయి వారినే బలి చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్నా మైన్స్​లలో వర్కర్స్​అదృశ్యమై రోజులు గడుస్తున్నా వారి జాడను కనుక్కోవటంలో యాజమాన్యం విఫలమవుతోంది. 

ఓపెన్​కాస్ట్​లోనూ పెరుగుతున్న ప్రమాదాలు
సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనుల్లోనూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. సింగరేణిలో 19 ఓపెన్​కాస్ట్​, 25 అండర్​గ్రౌండ్​మైన్స్​లో సుమారు 43 వేల మంది పర్మినెంటు కార్మికులు, 20 వేలకు పైగా కాంట్రాక్ట్​ కార్మికులున్నారు. డైరెక్టర్​జనరల్​ఆఫ్ మైన్స్​సేఫ్టీ(డీజీఎంఎస్​) రూల్స్​పై  యాజమాన్యం పెద్దగా దృష్టి పెట్టడంలేదు. అవుట్​సోర్సింగ్​ ద్వారా పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. వారు రూల్స్​పాటిస్తున్నారా లేదా అనేదీ తనిఖీ చేయడం లేదు. వందలకొద్ది వెహికల్స్, మిషనరీ ఉండే ఓసీపీల్లో చిన్నపాటి నిర్లక్ష్యంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్ గనిలో గత ఏడాది జనవరి 23న 60 టన్నుల డంపర్, వ్యాన్​ను ఢీకొట్టడంతో వ్యాన్​ డ్రైవర్​ దుర్గం కృష్ణస్వామి మృతిచెందాడు. ఏప్రిల్​ 6న కేకే ఓపెన్​కాస్ట్​ గనిలో మట్టిని తీసుకువెళ్తున్న వెహికల్​ఆగిన మరో వాహనాన్ని ఢీకొట్టడంతో జార్ఖండ్​ రాష్ట్రానికి చెందిన మదన్​మోహన్​దాస్​ అనే కాంట్రాక్ట్​ కార్మికుడు మృతిచెందాడు. గత ఏడాది జులై 2న రామగుండం ఏరియా 3 పరిధిలోని ఓసీపీ1లో ఓబీ బ్లాస్టింగ్​ కోసం ఎక్స్​ప్లోజివ్​ నింపుతున్న క్రమంలో భారీ పేలుడు జరిగి నలుగురు కాంట్రాక్ట్​ కార్మికులు మృతిచెందారు. తాజాగా మణుగూరు ఓసీపీలో డంపర్​ బొలెరోపై ఎక్కడంతో ముగ్గురు చనిపోయారు. డీజీఎంఎస్​  రూల్​ప్రకారం మట్టి, బొగ్గును తీసుకవెళ్లే  డంపర్ల(వెహికల్) వెడల్పును బట్టి అంతకు మూడు రెట్లు పెద్దగా గనుల్లో రోడ్లుండాలి. అయితే కేవలం ఒకే రహదారిని ఏర్పాటు చేస్తుండటంతో ఒక డంపర్​ వస్తే మరో డంపర్​ వెళ్లే వరకు వేచిచూడాల్సి వస్తోంది. అలాగే హెవీ వెహికల్స్​స్పీడ్​గా నడిపేవారిపై నిఘా, నియంత్రణ లేకపోవడం కూడా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణమవుతోంది. 

సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నాం
సింగరేణి యాజమాన్యం సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తోంది. జీఎంల రివ్యూ మీటింగ్​లలోనూ సీఎండీ సేఫ్టీ గురించే ఎక్కువగా చెప్తుంటారు. సాధ్యమైనంత మేర యాక్సిడెంట్లను తగ్గించేందుకు యాజమాన్యం కృషి చేస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను పాటిస్తే యాక్సిడెంట్లను దాదాపుగా నివారించవచ్చు. 
- అందెల ఆనందరావ్​, సింగరేణి కంపెనీ అధికార ప్రతినిధి, కొత్తగూడెం హెడ్డాఫీస్​